ఆసియా కప్‌ 2023 విషయంలో పాకిస్తాన్‌ మాటే నెగ్గింది..!

11 Jun, 2023 16:08 IST|Sakshi

ఆసియా కప్‌ 2023 (వన్డే ఫార్మాట్‌) విషయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. వారు అనుకున్నట్లుగా హైబ్రిడ్‌ మోడల్‌కు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) పచ్చజెండా ఊపడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. భారత్‌ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో.. భారత్‌ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ ఒప్పుకుందని తెలుస్తోంది.

పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ ప్రకారం ఆసియా కప్‌లో భాగంగా జరిగే 13 మ్యాచ్‌ల్లో 4 లేదా 5 మ్యాచ్‌లు మాత్రమే వారి స్వదేశంలో జరిగే అవకాశం ఉంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు సహా భారత్‌ ఆడే మిగతా మ్యచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరుగుతాయి. టీమిండియా ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్‌ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు.

అలాగే ఈ టోర్నీ షెడ్యూల్‌లోనూ స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కాకుండా సెప్టెంబర్‌ 1-17 మధ్యలో ఈ టోర్నీ జరిగవచ్చని సమాచారం. పాకిస్తాన్‌లో జరుగబోయే మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో జరుగుతాయని తెలుస్తోంది. మొత్తంగా ఆసియా కప్‌ 2023 విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

కాగా, రెగ్యులర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఆసియా కప్‌ 2023 నిర్వహణ హక్కులు తొలుత పాకిస్తాన్‌కే దక్కాయి. అయితే భారత్‌-పాక్‌ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో బీసీసీఐ.. భారత జట్టును పాక్‌కు పంపిచేందుకు నిరాకరించింది. దీంతో భారత్‌ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తామని పాక్‌ చెప్పింది. పాక్‌ ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే చెప్పినా.. మిగతా దేశాలు ఎండలకు సాకుగా చూపి నిరాకరించాయి.

దీంతో మధ్యే మార్గంగా ఏసీసీ శ్రీలంక పేరును ప్రతిపాదించగా, అందుకు అన్ని దేశాలు సరే అన్నాయి. ఆసియా కప్‌-2023లో భారత్‌, పాక్‌లతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌ జట్లు పాల్గొంటాయి. భారత్‌, పాక్‌, నేపాల్‌లు గ్రూప్‌-ఏలో.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు గ్రూప్‌-బిలో తలపడతాయి. ఆ తర్వాత సూపర్‌-4, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.  

చదవండి: గిల్‌ది ఔటే.. నేను క్లియర్‌గానే క్యాచ్‌ పట్టుకున్నా: గ్రీన్‌

మరిన్ని వార్తలు