‘ఆడుదాం ఆంధ్రా’.. క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం: సాత్విక్‌ సాయిరాజ్‌

12 Oct, 2023 14:35 IST|Sakshi

ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లను భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభినందించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్లేయర్స్‌తో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సాత్విక్‌ సాయిరాజ్‌ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. 

ఏషియన్ గేమ్స్‌లో మెడల్‌ సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు బాగుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సాత్విక్‌ పేర్కొన్నారు.

ఇక.. సాత్విక్ సాయిరాజ్‌ తల్లితండ్రులు కాశి విశ్వనాథ్, రంగమణి సైతం తమ కుమారుడి ఘనత పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సాత్విక్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల సందర్భంగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టితో కలిసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌ ‘పసిడి’ కల నెరవేరుస్తూ... పురుషుల డబుల్స్‌ విభాగంలో ఈ జోడీ స్వర్ణం సాధించింది. ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో భారత్‌కు తొలిసారి గోల్డ్‌ మెడల్‌ అందించి సువర్ణాధ్యాయానికి నాంది పలికింది.

హోంగ్జూలో జరిగిన ఫైనల్లో 21–18, 21–16తో చోయ్‌ సోల్‌గు–కిమ్‌ వన్‌హో (దక్షిణ కొరియా) జంటను ఓడించి ఈ మేరకు చాంపియన్‌గా అవతరించింది సాత్విక్‌- చిరాగ్‌ జోడీ. అంతేగాక ఈ అద్భుత విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి సాత్విక్‌–చిరాగ్‌ జంట నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోవడం విశేషం.   
చదవండి: ‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం 

మరిన్ని వార్తలు