AUS VS SA 3rd Test Day 1: రాణించిన లబూషేన్‌, ఖ్వాజా.. నిప్పులు చెరిగిన నోర్జే

4 Jan, 2023 15:52 IST|Sakshi

3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కమిన్స్‌ సేనను సఫారీ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ 4 బంతికి వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను అద్భుతమైన బంతితో దొరకబుచ్చుకున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో కేవలం 10 పరుగులు చేసిన వార్నర్‌.. మార్కో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్‌.. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా సాయంతో ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించిన అనంతరం.. నోర్జే వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి రోజు ఆఖరి బంతికి నోర్జే బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్‌ ఇచ్చి లబూషేన్‌ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఔటయ్యాడు. 

వెలుతురు లేమి కారణంగా లబూషేన్‌ ఔట్‌ అవ్వగానే అంపైర్లు మ్యాచ్‌ను ముగించారు. ఈ సమయానికి ఉస్మాన్‌ ఖ్వాజా (121 బంతుల్లో 54; 6 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆసీస్‌ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లలో ఆతిధ్య ఆసీస్‌ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు