కేవలం 2500 మందికే అనుమతి

26 Jul, 2020 07:05 IST|Sakshi

వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీకి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు

మెల్‌బోర్న్‌: కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నిర్వహణ తీరుతెన్నులపై ఇప్పటి నుంచే నిర్వాహకులు దృష్టి సారించారు. పూర్తిగా బయో సెక్యూర్‌ వాతావరణంలో, పరిమిత సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతించి టోర్నీ జరిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సీజన్‌ యూఎస్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలు ముగిస్తే తదుపరి సీజన్‌ కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందని టెన్నిస్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్రెగ్‌ టిలీ అన్నారు.

వచ్చే ఏడాది జనవరి 18 నుంచి జరిగే ఈ టోర్నీలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ప్రేక్షకులతో కలిపి కేవలం 2500 మందిని మాత్రమే అనుమతించే అవకాశముందని తెలిపారు. యూఎస్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనడం అనేది ఆసీస్‌ ఆటగాళ్ల వ్యక్తిగత విషయమన్న ఆయన వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు అంత సులువుగా దేశం దాటి వెళ్లలేరని, క్వారంటైన్‌ నిబంధనలతో ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్పుడుతుందని క్రెగ్‌ సూచించారు.

మరిన్ని వార్తలు