Simon Doull: ఆ నలుగురు కాదు.. బాబర్‌ ఆజమే ది బెస్ట్‌..!

26 Jun, 2022 18:05 IST|Sakshi

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై కివీస్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్‌ ఆజమ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ అని డౌల్ కొనియాడాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో బాబర్‌ అందరికంటే టాలెంటెడ్‌ క్రికెటర్‌ అని కితాబునిచ్చాడు. ఆ నలుగురుగా పిలువబడే విరాట్‌ కోహ్లి, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ కంటే బాబర్‌ ఆజమే అత్యుత్తమ క్రికెటర్‌ అని, అతను ఇటీవలి కాలంలో నమోదు చేసిన గణాంకాలే ఇందుకు నిద్శనమని అన్నాడు. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ మూడో రోజు ఆట సందర్భంగా డౌల్‌ బాబర్‌ను ఆకాశానికెత్తాడు.

టాపార్డర్‌లో బాబర్‌ అద్భుతంగా ఆడుతున్నాడని, 'ఆ నలుగురితో' పోలిస్తే మెరుగ్గా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. ఇటీవలి కాలంలో రూట్ కూడా మెరుగ్గానే రాణిస్తున్నప్పటికీ టెక్నిక్‌ పరంగా బాబరే బెస్ట్ ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు. తన అభిప్రాయంతో ఎవరూ విభేదించలేని స్థితిలో బాబర్‌ ఉన్నాడని తెలిపాడు. 

కాగా, బాబర్‌ ఆజమ్‌ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. వన్డేల్లో అతను అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (13 ఇన్నింగ్స్‌లు) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2017లో కోహ్లి 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించగా బాబర్‌ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

బాబర్.. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 89 మ్యాచ్‌ల్లో 17 శతకాలు, 19 అర్ధ సెంచరీల సాయంతో 45.98 సగటున 4442 పరుగులు చేశాడు. 74 టీ20ల్లో శతకం, 26 అర్ధ సెంచరీల సాయంతో 2686 పరుగులు (129.45 స్ట్రైక్ రేటుతో) చేశాడు. 40 టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, 21 అర్ధ శతకాల సాయంతో 46 సగటున 2851 పరుగులు చేశాడు.
చదవండి: ఇంగ్లండ్‌ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ

మరిన్ని వార్తలు