వచ్చే వారంలో ఆసీస్‌ పర్యటనకు భారత జట్టు ఎంపిక!

20 Oct, 2020 06:07 IST|Sakshi

ముంబై: మరో మూడు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ పూర్తిస్థాయి సిరీస్‌లలో పాల్గొననుంది. కానీ జట్టు ఎంపికపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. వచ్చే వారం ఆయా జట్లను ప్రకటించే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆదివారం బీసీసీఐ చీఫ్‌ గంగూలీ మాట్లాడుతూ తేదీలు మినహా వేదికలు, మ్యాచ్‌లు ఖరారయ్యాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రం నుంచి ఆమోదం కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎదురుచూస్తోంది. అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే పూర్తిస్థాయి షెడ్యూల్‌ను తేదీలతోసహా సీఏ ప్రకటిస్తుంది. రెండున్నర నెలల పాటుసాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు ముందనుకున్న షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 12న అక్కడికి బయల్దేరనుంది. అనంతరం 14 రోజుల క్వారంటైన్‌ ముగిశాక కసరత్తు ప్రారంభిస్తుంది. ఐపీఎల్‌ వర్క్‌లోడ్, ఆటగాళ్ల గాయాలను దృష్టిలో పెట్టుకొని త్వరలో జట్టును ఎంపిక చేసే అవకాశముంది. ఇప్పటికే భువనేశ్వర్, ఇషాంత్‌ శర్మ సహా పలువురు ఆటగాళ్లు గాయపడి లీగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు