రనౌట్‌ వివాదం.. స్టోక్స్‌ అవుటా.. కాదా?

27 Mar, 2021 08:01 IST|Sakshi

పుణే: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని ధాటికి ఇంగ్లండ్‌ జట్టు మరో 6.3 ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. కాగా స్టోక్స్‌ 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రనౌట్‌ విషయంలో క్లారిటీ లేకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే స్టోక్స్‌ రనౌటా.. కాదా? అనేది సోషల్‌ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఒకవేళ స్టోక్స్‌ను అవుట్‌గా ప్రకటించి ఉంటే మాత్రం ఫలితం వేరేలాగా ఉండేది.

అసలు విషయంలోకి వెళితే.. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌ అయిదో బంతిని స్టోక్స్‌ మిడాన్‌ దిశగా షాట్‌ను ఆడాడు. సింగిల్‌ పూర్తి చేసిన స్టోక్స్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించగా కుల్దీప్‌ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. స్టోక్స్‌ బ్యాట్‌ క్రీజులో లేకపోవడంతో అంతా అవుటేనని భావించారు. అయితే రిప్లేలో చాలాసార్లు పరీక్షించిన థర్డ్‌ అంపైర్‌ క్లారిటీ లేకపోవడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే స్టోక్స్‌ బ్యాట్‌ గీత దాటి లోపలికి రాకముందే బంతి వికెట్లను గిరాటేసిందని.. అది ఔటేనని యువరాజ్‌ సింగ్‌ సహా పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

అలా 31 పరుగుల వద్ద ఔట్‌ నుంచి బయటపడిన స్టోక్స్‌ ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. కుల్దీప్‌ ఓవర్లో 6, 4 బాది 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత స్టోక్స్‌ కొట్టిన షాట్లు భారత్‌ గెలిచే అవకాశాలను దూరం చేశాయి.  అర్ధసెంచరీ తర్వాత తాను ఆడిన 11 బంతుల్లో స్టోక్స్‌ వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 (మొత్తం 49) బాదడం విశేషం. ముఖ్యంగా కుల్దీప్‌ ఓవ ర్లో కొట్టిన మూడు వరుస సిక్సర్లు, కృనాల్‌ ఓవర్లో కొట్టిన 3 సిక్స్‌ లు, 1 ఫోర్‌ స్టోక్స్‌ ఎంత ప్రమాదకారో చూపించాయి.
చదవండి: భారత్‌ నెత్తిన బెయిర్‌ స్ట్రోక్స్‌
బెన్‌స్టోక్స్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. ఏం చేశాడంటే!

మరిన్ని వార్తలు