Carlos Brathwaite: 2016 టి20 ప్రపంచకప్‌ హీరోకు వింత అనుభవం..

18 Apr, 2022 19:32 IST|Sakshi

వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌కు వింత అనుభవం ఎదురైంది. గాయం కారణంగా జట్టుకు ఆరు నెలలపాటు దూరమైన బ్రాత్‌వైట్‌ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి డొమొస్టిక్‌ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్‌ బర్మింగ్‌హమ్‌ డిస్ట్రిక్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నోల్‌ అండ్‌ డోరిడ్జ్‌ సీసీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరు నెలల తర్వాత తొలి మ్యాచ్‌ ఆడుతున్న బ్రాత్‌వైట్‌కు నిరాశే ఎదురైంది.

లీమింగ్‌టన్‌ సీసీతో మ్యాచ్‌లో బ్రాత్‌వైట్‌ తొలి బంతికే ఔటయ్యాడు. భారీషాట్‌కు యత్నించి క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌డక్‌ అయ్యాడు.ఆ తర్వాత బౌలింగ్‌లోనూ బ్రాత్‌వైట్‌ పెద్దగా రాణించలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అలా నిరాశజనక ప్రదర్శనతో రోజును ముగించే పనిలో ఉన్న బ్రాత్‌వైట్‌కు మరొక బిగ్‌షాక్‌ తగిలింది. తనకు ఎంతో ఇష్టమైన కారును కూడా ఎవరో దొంగలించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రాత్‌వైట్‌ ట్విటర్‌లో తెగ బాధపడిపోయాడు.

 

''నిన్నటి రోజు నాకు పీడకల లాంటిది.. ఆరు నెలల తర్వాత మ్యాచ్‌ ఆడాను.. డకౌట్‌ అయ్యాడు.. బౌలింగ్‌ వేశాను.. అందులోనూ నిరాశే ఎదురైంది.. ఇక రోజు చివరలో నా కారును ఎవరో దొంగతనం చేశారు.. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. ఇన్ని చెత్త విషయాల మధ్య ఒక మంచి విషయం ఏంటో చెప్పనా.. మరుసటిరోజు తెల్లవారుజామునే సూర్యుడు మెరుస్తూ నాకు వెల్‌కమ్‌ చెప్పాడు.'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. 

కాగా బ్రాత్‌వైట్‌ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన దశలో బ్రాత్‌వైట్‌ నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్‌ రెండోసారి టి20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బ్రాత్‌వైట్‌ విండీస్‌ తరపున 3 టెస్టులు, 44 వన్డేలు, 41 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 

చదవండి: BCCI: 'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు'

Wasim Jaffer: 'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్‌కే పరిస్థితి ఇదే

మరిన్ని వార్తలు