Jofra Archer: పంజాబ్‌లో ఆప్‌ "స్వీప్‌"ను జోఫ్రా ఆర్చర్‌ ముందే ఊహించాడా..?

10 Mar, 2022 19:06 IST|Sakshi

Did Archer Predict AAPs Clean Sweep In Punjab: అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 2022 ఇవాళ (మార్చి 10) వెలువడిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని బంపర్‌ మెజర్టీతో జయకేతనం ఎగురవేసి, ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదల్‌, బీజేపీలకు షాకిచ్చింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉన్న పంజాబ్‌ అసెంబ్లీలో ఆప్‌ 90కి పైగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఆప్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 


అవును, ఆప్‌ పంజాబ్‌ను ఊడ్చేసింది అంటూ.. ఆ పార్టీ ఇవాళ మధ్యాహ్నం 12:55 గంటలకు ఓ ట్వీట్‌ చేసింది. ఆప్‌ నిజంగానే పంజాబ్‌ను ఊడ్చేసింది కదా.. ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా..? ఇక్కడే ఆప్‌ ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. గతంలో ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌ చేసిన ఓ ట్వీట్‌ను ఈ పోస్ట్‌కి ట్యాగ్‌ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆర్చర్‌ చేసిన ఆ ట్వీట్‌లో స్వీప్‌ అని పేర్కొని ఉంది. దీన్నే పంజాబ్‌లో తాము సాధించిన విజయంతో లింక్‌ చేసింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. 


ఆర్చర్‌ గతంలో చేసిన చాలా ట్వీట్లు యాదృచ్చికంగా నిజానికి దగ్గరగా ఉండటంతో ఆప్‌ చేసిన ఈ ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. 2013 మార్చిలో ఆర్చర్‌.. మార్చ్‌ 24? అని ట్వీట్‌ చేయగా, 2020వ సంవత్సరం అదే రోజు కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడింది. అలాగే అదే ఏడాది మార్చి 22న ఆర్చర్‌ లైట్స్‌ ఔట్‌ అని ట్వీట్‌ చేయగా, 2020 అక్టోబర్‌ 30న పవర్‌ గ్రిడ్‌ ఫెయిల్యూర్‌ కారణంగా ముంబైని చీకటి కమ్మేసింది. 


ఇక కమాన్‌ రష్యా అంటూ ఆర్చర్‌ 2014 జూన్‌ 22న ట్వీట్‌ చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్‌ సైన్యం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇలా ఆర్చర్‌ చేసిన ట్వీట్లు యాదృచ్చికంగా ఏదో ఒక సందర్భంతో ముడిపడి ఉండటంతో నెటిజన్లు అతన్ని అభినవ నోస్ట్రడామస్‌ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రకటించిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ జయకేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌.. పంజాబ్‌ సీఎం అభ్యర్ధి భగవంత్‌ మాన్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను కేజ్రీవాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.     


చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్‌ ధర..!

మరిన్ని వార్తలు