బుమ్రా.. ఇకపై ఐపీఎల్‌ మాత్రమే ఆడతావా..?

1 Nov, 2022 14:51 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 తర్వాత టీమిండియా వెళ్లబోయే రెండు విదేశీ పర్యటనల కోసం సెలెక్షన్‌ కమిటీ నిన్న (అక్టోబర్‌ 31) వేర్వేరు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ ముగిసిన వెంటనే భారత్‌.. నవంబర్‌ 18 నుంచి 30 వరకు న్యూజిలాండ్‌లో, ఆతర్వాత డిసెంబర్‌ 4 నుంచి 26 వరకు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. తొలుత జరుగబోయే న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుండగా.. టీ20 జట్టుకు హార్ధిక్‌ పాండ్యా, వన్డే జట్టుకు శిఖర్‌ ధవన్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అనంతరం బంగ్లాదేశ్‌ పర్యటనలో టీమిండియా 3 వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. రెండు ఫార్మాట్లలో రోహిత్‌ శర్మ సారధిగా వ్యవహరించనున్నాడు.

ఈ రెండు పర్యటనల కోసం ప్రకటించిన జట్లలో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా పేరు కనిపించకపోవడంతో భారత క్రికెట్‌ అభిమానులు రకారకాల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అసలు బుమ్రాకు ఏమైంది.. ఇంతకీ అతను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడతాడా.. లేక ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమవుతాడా అన్న సందేహాన్ని తెరపైకి తెస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన బుమ్రా.. నెలలు గడుస్తున్నా జట్టులోకి తిరిగి రాకపోవడాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఫిట్‌గా ఉన్నా సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోవట్లేదా అన్న కోణంలో కూడా  విచారిస్తున్నారు. 

2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 28 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 30 టెస్ట్‌లు, 72 వన్డేలు, 56 టీ20లు మాత్రమే ఆడాడు. బుమ్రా తన ఆరేళ్ల కెరీర్‌లో ఇన్ని తక్కువ మ్యాచ్‌లు ఆడటాన్ని అభిమానులు చాలా రోజులుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరోవైపు 2013లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన బుమ్రా.. ఆడిన ప్రతి సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాకుండా ఇప్పటివరకు 120 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌పై ఇంత శ్రద్ధ పెట్టే బుమ్రా.. అంతర్జాతీయ మ్యాచ్‌లపై ఫోకస్‌ పెట్టకపోవడం పట్ల అభిమానులు చింతిస్తున్నారు.

ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అతను క్రమం తప్పకుండా అన్ని ఫార్మాట్లు ఆడింది వేళ్లపై లెక్కపెట్టవచ్చని ఆధారాలతో సహా చూపిస్తున్నారు. రెస్ట్‌ అనో లేక గాయాల పేరుతోనో కీలక సిరీస్‌లకు అందుబాటులో ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ కోసం హడావుడిగా జట్టులోకి వచ్చిన బుమ్రా.. అంతే హడావుడిగా ఎగ్జిట్‌ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ పరిమాణాల నేపథ్యంలో అసలు బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్‌​ ఆడే ఉద్దేశం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌ మాత్రమే ఆడాలనుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఇష్టమొచ్చిన లీగ్‌లో ఆడుకొవచ్చని సలహా ఇస్తున్నారు. ఓ పక్క నాణ్యమైన పేసర్‌ లేక భారత జట్టు సతమతమవుతుంటే.. ఆ బాధ బుమ్రాకు తెలుస్తుందా అని నిలదీస్తున్నారు. దేశం ఎటైనా పోని డబ్బే కావాలనుకుంటే హాయిగా ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కావచ్చని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు