BGT: దానర్థం జట్టు నుంచి తప్పించినట్లు కాదు! రాహుల్‌కు మరిన్ని అవకాశాలు! వైస్‌ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. కాకపోతే..

26 Feb, 2023 11:42 IST|Sakshi

India Vs Australia 2023 Test series: గత కొన్నాళ్లుగా సంప్రదాయ ఫార్మాట్‌లో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అంశంపై క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సమీపిస్తున్న తరుణంలో వైస్‌ కెప్టెన్‌గా ఎవరైతే బాగుంటారన్న విషయంపై మాజీలు స్పందిస్తున్నారు. రాహుల్‌ను జట్టు నుంచి తప్పించి ప్రతిభ ఉన్న యువకులకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఇక ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు ఆఖరి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ రాహుల్‌కు ఉన్న వైస్‌ కెప్టెన్‌ అన్న ట్యాగ్‌ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్‌ సబా కరీం సైతం రాహుల్‌ విషయంలో అభిప్రాయాలు పంచుకున్నాడు.

రాహుల్‌కు మరిన్ని అవకాశాలు.. ఎందుకంటే
భవిష్యత్తులో వైస్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఈ ఇద్దరికే ఉన్నాయంటూ జోస్యం చెప్పాడు. ‘‘నిజానికి ఓ ఆటగాడి ప్రదర్శన బాగుంటేనే వైస్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అతడి ఆట తీరు గొప్పగా ఏమీ లేదు. అందుకే వైస్‌ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. దానర్థం తుది జట్టులో చోటివ్వరని కాదు. 

ఒకవేళ జట్టు ఓడిపోయిందనుకోండి. కేఎల్‌ రాహుల్‌ను కచ్చితంగా తప్పించేవారు. కానీ.. రెండు సందర్భాల్లో టీమిండియా గెలుపొందింది. వికెట్‌ బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించలేదు. కాబట్టి రాహుల్‌కు మరిన్ని అవకావాలు దక్కగలవు’’ అని సబా కరీం ఇండియా న్యూస్‌ స్పోర్ట్స్'తో వ్యాఖ్యానించారు.

వాళ్లిద్దరిలో ఒకరు వైస్‌ కెప్టెన్‌
అదే విధంగా.. ‘‘తదుపరి ఎవరిని వైస్‌ కెప్టెన్‌ చేయాలన్న అంశంలో ఆట తీరుతో పాటు వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బాగా ఆడటంతో పాటు కెప్టెన్‌ గైర్హాజరీలో జట్టును సరైన దిశలో ముందుకు నడిపే నాయకుడు కావాలి.

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ సైకిల్‌లో ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమే. ప్రస్తుత ఆటగాళ్లను పరిశీలిస్తే.. నా దృష్టిలో రవీంద్ర జడేజా, రిషభ్‌ పంత్‌ ఈ పదవికి అర్హులు. అయితే, జడేజాకు ఆల్‌రౌండర్‌గా పనిభారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. పంత్‌కే అవకాశాలు ఎక్కువ.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అతడు కోలుకుని తిరిగి ఫిట్‌నెస్‌ సాధించే వరకు బోర్డు ఎదురుచూస్తున్నట్లు ఉంది’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది.

ఇండోర్‌ వేదికగా మార్చి 1న ఆరంభం కానున్న మూడో టెస్టులో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక రాహుల్‌ వైఫల్యం కారణంగా అతడి స్థానంలో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

చదవండి: వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్‌ మాజీ ప్లేయర్‌
Vijender Singh: ఉద్యోగం కోసమే మొదలెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకని వారించినా!

మరిన్ని వార్తలు