ODI WC 2023: ఇక బుమ్రా లేకుండానే...! ఉమ్రాన్‌ ఆ లోటు తీర్చగలడు.. కానీ..

12 Jan, 2023 11:22 IST|Sakshi

ODI World Cup 2023- Team India Pacers: ‘‘సెప్టెంబరు నుంచి అతడు క్రికెట్‌ ఆడటమే లేదు. నాకు తెలిసి ఇకపై తను లేకుండానే భారత జట్టు అన్ని మ్యాచ్‌లకు సిద్ధమైపోవాలి. మధ్యలో ఏదో ఒక్క మ్యాచ్‌ ఆడి.. వెళ్లిపోయాడు. మళ్లీ ఇంతవరకు పునరాగమనం చేయనేలేదు. తిరిగి జట్టులోకి వస్తాడో లేదో కూడా తెలియదు. మొన్నటికి మొన్న తను జట్టులో ఉన్నట్లు ప్రకటించారు. కానీ వెంటనే మళ్లీ గాయం కారణంగా దూరం. అసలే ఈ ఏడాది వరల్డ్‌కప్‌ ఉంది. 

ఇలాంటి తరుణంలో కీలక ఆటగాడు ఇలా పదే పదే జట్టుకు దూరం కావడం సానుకూల అంశమైతే కాదు. ఇప్పటికే ఓ ప్రపంచకప్‌ టోర్నీ మిస్సయ్యాడు. నాకు తెలిసి ఇక ముందు కూడా జట్టులోకి వస్తాడో లేదో అనుమానమే!’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. భారత జట్టు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతం
వెన్ను నొప్పి కారణంగా.. గతేడాది ఆసియా టీ20 కప్‌, టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలకు బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. ముందుగా ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేనప్పటికీ ఫిట్‌నెస్‌ సాధించిన కారణంగా ఆఖరి నిమిషంలో అతడి పేరును చేర్చారు. కానీ మళ్లీ అంతలోనే గాయం వేధిస్తుండటంతో అందుబాటులోకి లేకుండా పోయాడు.

తను భర్తీ చేయగలడు!
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా బుమ్రా భవిష్యత్తు గురించి పైవిధంగా స్పందించాడు. ఇదే గనుక పునరావృతమైతే అతడు లేకుండానే టీమిండియా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా భారత పేస్‌ విభాగం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్లు ఇప్పుడైతే లేరని, అయితే ఉమ్రాన్‌ మాలిక్‌ కొంతవరకు బుమ్రా లేని లోటు తీరుస్తాడని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. మహ్మద్‌ సిరాజ్‌ సైతం సత్తా చాటుతున్నాడని, తనతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా ప్రభావం చూపగలుగుతున్నాడన్నాడు. 

అయితే, ప్రసిద్‌ కృష్ణ గురించి మాత్రం ఇప్పుడే అంచనాకు రాలేమని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. బుమ్రా ఉంటేనే మ్యాచ్‌లు గెలవడం సాధ్యమవుతుందని తాను అనడం లేదని, తను జట్టులో ఉంటే విజయావకాశాలు పెరుగుతాయని మాత్రం చెప్పగలగనని పేర్కొన్నాడు. కానీ అతడి ఫిట్‌నెస్‌ సమస్యలు చూస్తుంటే తను తిరిగి జట్టులోకి వస్తాడనే నమ్మకం మాత్రం లేదని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

చదవండి: SA20 2023: డికాక్‌ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి
Prithvi Shaw: ఏకైక భారత ఆటగాడిగా పృథ్వీ షా.. ఈ రికార్డు కూడా తన ఖాతాలోనే! ఇప్పటికైనా..

>
మరిన్ని వార్తలు