అభిమానులకు షాక్‌.. వచ్చే ఒలింపిక్స్‌లో ఆ క్రీడ డౌటే

10 Aug, 2021 19:31 IST|Sakshi

స్విట్జర్లాండ్‌: వెయిట్‌ లిఫ్టింగ్‌ అభిమానులకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) షాక్‌ ఇవ్వనుంది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తుంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లలో చాలామంది డోపింగ్‌కు పాల్పడినట్లు తెలిసిందంటూ ఐవోసీ పేర్కొంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు బరువులు ఎత్తడానికి నిషేదిత డ్రగ్స్‌ వాడుతున్నట్లు వాదనలు వినిపించాయి. అంతేగాక డ్రగ్స్ వాడుతూ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని తేలింది.

దీనిపై గతంలోనే ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)కు ఐవోసీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో పెద్ద ఎత్తున డోపీలు పట్టుబడుతుండడంతో ఐవోసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వెయిట్‌ లిఫ్టింగ్‌ను సస్పెండ్‌ చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. అయితే తాము పేర్కొన్న సంస్కరణల అమలుపై ఐడబ్ల్యూఎఫ్  చర్యలు తీసుకుంటే.. 2028 లాస్ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ను తిరిగి చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ఐవోసీ వెల్లడించింది. 

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో  వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత​ అథ్లెట్‌ మీరాబాయి చాను రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది.  కాగా ఒలింపిక్స్‌ ప్రారంభమైన రెండో రోజే దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో కరణం మల్లీశ్వరీ(కాంస్యం, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌) తర్వాత దేశానికి రెండో పతకం అందించిన మహిళగా మీరాబాయి నిలిచింది. 
 

మరిన్ని వార్తలు