FIFA WC 2022: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు

30 Nov, 2022 15:58 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికా ప్రి క్వార్టర్స్‌కు చేరుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 1-0తో గెలిచి రౌండ్ ఆఫ్‌ 16కు అర్హత సాధించింది. ఆట 38వ నిమిషంలో అమెరికా ఫుట్‌బాలర్‌ పులిసిక్‌ కొట్టిన గోల్‌ జట్టుకు విజయంతో పాటు ప్రి క్వార్టర్స్‌కు చేర్చింది. ఇక రిఫరీ మ్యాచ్‌ ముగిసిందని విజిల్‌ వేయగానే ఇరాన్‌ ఆటగాడు మెహదీ తరేమి కన్నీటిపర్యంతం అయ్యాడు.

ఇది గమనించిన యూఎస్‌ఏ ఫుట్‌బాలర్‌ ఆంటోనీ రాబిన్‌సన్‌ తరేమి వద్దకు వచ్చి అతన్ని ఓదార్చాడు. విషయంలోకి వెళితే.. మరికొద్దిసేపట్లో ఆట ముగస్తుందనగా తరేమి పెనాల్టీగా భావించి సలహా కోసం రిఫరీ వద్దకు వెళ్లాడు. అయితే అది పట్టించుకోకుండా రిఫరీ విజిల్‌ వేయడం.. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లు అతని వద్దకు రావడంతో కన్నీళ్లు ఆగలేదు. అప్పుడే రాబిన్‌సన్‌ వచ్చి తరేమిని ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు.. ఇది రాజకీయం మాత్రం కాదు.. క్రీడాస్పూర్తి మాత్రమే'' అంటూ కామెంట్‌ చేశారు.

ఇక ఇరాన్‌, అమెరికాల మధ్య సత్సంబంధాలు లేవు. 40 సంవత్సరాల క్రితమే  దౌత్య సంబంధాలను తెంచుకున్న ఇరు దేశాలు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎదురుపడడం ఆసక్తి కలిగించింది. అమెరికాతో జాగ్రత్తగా ఉండాలని ఇరాన్‌ ఆటగాళ్లకు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇరాన్‌లో ప్రస్తుతం హిజాబ్‌ రగడ నడుస్తోంది. దీంతో వారికి మద్దతుగా ఇరాన్‌ ఫుట్‌బాల్‌ టీం జాతీయ గీతం ఆలపించేందుకు నిరాకరించింది. దీనికి సీరియస్‌గా తీసుకున్న ఐఆర్‌జీసీ ఆటగాళ్లు ఇలాగే చేస్తే జైలుకు పంపిస్తామని.. వారి కుటుంబాలకు నరకం అంటే చూపిస్తామని హెచ్చరించడం గమనార్హం.

చదవండి: ఇంగ్లండ్‌ జట్టులో కలకలం.. 15 మందికి గుర్తుతెలియని వైరస్‌

మరిన్ని వార్తలు