Venkatesh Prasad: లండన్ ​విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్న భారత మాజీ పేసర్​

16 Jul, 2022 18:03 IST|Sakshi

క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టవచ్చు. భారత క్రికెట్‌లో అయితే ఆ సంఖ్య మరీ తక్కువనే చెప్పాలి. భారత క్రికెట్‌ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కనీసం డిగ్రీ కూడా చదవలేదు. ఈ మధ్య జనరేషన్‌లో టీమిండియా తరఫున రాణించి, మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఓ క్రికెటర్‌ లేటు వయసులో చదువుపై దృష్టి సారించాడు. 

రిటైర్మెంట్ తర్వాత డిగ్రీ, పీజీ పూర్తి చేసి చదువు మధ్యలోనే ఆపేసిన చాలామంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. అతనే టీమిండియా మాజీ పేసర్‌, భారత మాజీ బౌలింగ్‌ కోచ్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌. కర్ణాటకకు చెందిన వెంకటేశ్‌ ప్రసాద్ ఇటీవలే ప్రతిష్టాత్మక లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్‌లో పీజీ పట్టా పొందాడు. 

ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ‘నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ నుంచి  ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ పట్టా అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. స్పోర్ట్స్‌ ఫీల్డ్‌లో మరింత సేవ చేయడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 

కాగా, దాదాపు రెండు దశబ్దాల పాటు భారత క్రికెట్‌ జట్టుకు సేవలందించిన ప్రసాద్.. 1996 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా హైలైట్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఓపెనర్‌ అమీర్‌ సోహైల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన తర్వాత ప్రసాద్‌ ప్రదర్శించిన హావభావాలు భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ మ్యాచ్‌లో ప్రసాద్‌ బౌలింగ్‌లో సోహైల్‌ బౌండరీ బాది వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ మరుసటి బంతికే ప్రసాద్‌.. సోహైల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పం‍పాడు.   
చదవండి: 'కోహ్లిని గాడిలో పెట్టగల వ్యక్తి సచిన్‌ మాత్రమే'

మరిన్ని వార్తలు