'ఇద్దరు ఐకాన్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'

19 Feb, 2021 14:42 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను మరోసారి అదృష్టం వరించింది. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్‌ వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన అతన్ని రూ.14.25 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. అయితే వేలానికి రెండు రోజుల ముందు ఐపీఎల్‌లో కోహ్లితో కలిసి ఆడాలని ఉందని మ్యాక్స్‌వెల్‌ తన మనసులో మాటను బయటపెట్టాడు. ఐపీఎల్‌ తర్వాత టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ మ్యాక్సీ అద్బుత ప్రదర్శన చేయడంతో వేలంలో అతనికి బాగా క్రేజ్‌ వచ్చింది.

మ్యాక్సీ సరదాగా అన్న మాటను నిజం చేస్తూ వేలంలో మ్యాక్స్‌వెల్‌ కోసం ఆర్‌సీబీ సీఎస్‌కేతో తీవ్రంగా పోటీ పడింది. చివరకు భారీ ధర వెచ్చించి దక్కించుకుంది. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌కు స్వాగతం పలుకుతూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.'మా ఆర్మీలోకి స్వాగతం  మ్యాక్సీ.. నీకోసం ఎదురుచూస్తున్నాం.. ఐపీఎల్‌ 2021లో కలుద్దాం' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీనిపై మ్యాక్స్‌వెల్‌ స్పందించాడు.

'గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ వేలంలో నాకోసం సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరకు పెద్ద మొత్తం వెచ్చించి ఆర్‌సీబీ నన్ను దక్కించుకుంది. నాకు సపోర్ట్‌ ఇచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కోహ్లి, డివిలియర్స్‌ లాంటి ఐకాన్‌ ఆటగాళ్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. అంతేగాక ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌తో పాటు పాత మిత్రుడు యజ్వేంద్ర చహల్‌ను కలుసుకునేందుకు ఉత్సాహంతో ఉన్నా. ఆర్‌సీబీ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తా. ఈసారి పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉంటాను కాబట్టి ఆర్‌సీబీకి మొదటి టైటిల్‌ అందించేందుకు ప్రయత్నిస్తా' అంటూ తెలిపాడు.కాగా గత సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్‌ రూ. 10.75 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ పంజాబ్‌ తరపున 13 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌ 108 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. 
చదవండి: మ్యాక్స్‌ ‘వెరీవెల్‌’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం

మరిన్ని వార్తలు