హర్భజన్‌ సింగ్‌ ఆడటం లేదు

5 Sep, 2020 02:32 IST|Sakshi

ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన స్పిన్నర్‌ 

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–2020 నుంచి సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ తప్పుకోవడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ టోర్నీకి అతను దూరమవుతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చినా... శుక్రవారం భజ్జీ దానిని అధికారికంగా ప్రకటించాడు. ‘వ్యక్తిగత కారణాలతో నేను ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడటం లేదు. కొన్ని రకాల కఠిన పరిస్థితులను ఎదుర్కొం టున్న తరుణంలో నాకు కాస్త ఏకాంతం కావాలి.  నేను నా కుటుంబంతో గడప దల్చుకున్నాను. సీఎస్‌కే జట్టు మేనేజ్‌మెంట్‌ నాకు అన్ని విధాలా అండగా నిలిచింది. ఆ జట్టు ఐపీఎల్‌లో బాగా ఆడాలని కోరుకుంటున్నా, జైహింద్‌’ అని భజ్జీ ట్వీట్‌ చేశాడు. చెన్నైలో నిర్వహించిన శిబిరానికి దూరంగా ఉన్న అతను ఆగస్టు 21న జట్టుతో కలిసి ప్రయాణించలేదు. ఈ నెల 1న అతను దుబాయ్‌ వస్తాడని భావించినా అదీ జరగలేదు. దాంతో లీగ్‌లో హర్భజన్‌ పాల్గొనడంపై సందేహాలు రేగాయి. ఇప్పటికే సురేశ్‌ రైనా కూడా తప్పుకోవడంతో చెన్నై జట్టు ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయినట్లయింది.  

లీగ్‌లో తనదైన ముద్ర 
ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన బౌలర్లలో హర్భజన్‌ ఒకడు. పొదు పుగా బౌలింగ్‌ చేయడం తో పాటు లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను మూ డో స్థానంలో ఉన్నాడు. 2008 నుంచి 2017 వరకు పది సీజన్ల పాటు హర్భజన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో చెన్నై జట్టులోకి వచ్చిన అతను టీమ్‌ టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది రన్నరప్‌గా నిలవడంలో కూడా భజ్జీ పాత్ర ఉంది. ఓవరాల్‌గా 160 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 7.05 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు. 

మరిన్ని వార్తలు