సీఎస్‌కేకు వెటరన్‌ ప్లేయర్‌ గుడ్‌బై

20 Jan, 2021 17:07 IST|Sakshi

చెన్నై: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని భజ్జీనే ట్విటర్‌ వేదికగా స్వయంగా ప్రకటించాడు. చెన్నై టీమ్‌తో తనకున్న రెండేళ్ల అనుబంధం బుధవారంతో ముగిసిందని తెలిపాడు. ' ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌తో ఈరోజుతో నా ఒప్పందం పూర్తైంది. చెన్నై టీమ్‌కు ప్రాతినిధ్యం వహించనడం గొప్ప అనుభవం. రెండెళ్ల పాటు చెన్నైకు ప్రాతినిధ్యం వహించిన తనకు జట్టుతో ఎన్నో​ మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అంతేగాక ఈ రెండేళ్లలో నన్ను గుర్తుపెట్టుకునే.. నేను గుర్తుంచుకునే స్నేహితులను పొందాను. ఈ సందర్భంగా నాకు అండగా నిలిచిన సీఎస్‌కే యాజమాన్యానికి, సిబ్బందికి, నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్‌ చేశాడు.

కాగా హర్భజన్‌ సింగ్‌ ఐపీఎల్‌లో 2018 నుంచి 2020 వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో జరిగిన వేలంలో చెన్నై జట్టు భజ్జీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ కెరీర్‌లో ముంబై ఇండియన్స్‌కు ఎక్కువకాలం పాటు కొనసాగిన హర్బజన్‌ మొత్తం 160 మ్యాచ్‌లాడి 150 వికెట్లు తీశాడు. కాగా 2018 సీజన్‌లో చెన్నై తరపున 13 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. అయితే మలి సీజన్‌(2019లో) మాత్రం 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌(2020)కు మాత్రం వ్యక్తిగత కారణాల రిత్యా దూరమైనట్లు భజ్జీ ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు