Mushtaq Ali Trophy: తిలక్‌ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌.. సెమీ ఫైనల్లో హైదరాబాద్‌

18 Nov, 2021 23:57 IST|Sakshi

క్వార్టర్స్‌లో 30 పరుగులతో గుజరాత్‌పై విజయం      

Syed Mushtaq Ali Trophy-Hyderabad Enter Into Semi-Finals: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో హైదరాబాద్‌ 30 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. ముందుగా హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఠాకూర్‌ తిలక్‌ వర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా...కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ బుద్ధి (16 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. రిపాల్‌ పటేల్‌ (24 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టి. రవితేజ (3/27), సీవీ మిలింద్‌ (2/28) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు.  

కర్నాటక సూపర్‌ ఓవర్‌తో... 
కర్నాటకతో క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ విజయలక్ష్యం 161 పరుగులు...చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, 2 సిక్స్‌లు, ఫోర్‌ సహా తొలి ఐదు బంతుల్లో బెంగాల్‌ 19 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించిన ఆకాశ్‌ దీప్‌ను మనీశ్‌ పాండే డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. దాంతో స్కోరు సమమైన మ్యాచ్‌ ‘సూపర్‌ ఓవర్‌’కు వెళ్లింది. బెంగాల్‌ 5 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోగా...కర్నాటక 2 బంతుల్లో ఆట ముగించింది. అంతకు ముందు కర్నాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. కరుణ్‌ నాయర్‌ (29 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం రితిక్‌ ఛటర్జీ (51) అర్ధసెంచరీ సహాయంతో బెంగాల్‌ కూడా 160 పరుగులు చేయగలిగింది.  

తమిళనాడు, విదర్భ కూడా... 
కేరళపై 5 వికెట్లతో గెలిచిన తమిళనాడు సెమీస్‌ చేరింది. ముందుగా కేరళ 4 వికెట్లకు 181 పరుగులు చేయగా, తమిళనాడు 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు సాధించింది. మరో క్వార్టర్స్‌లో విదర్భ 9 వికెట్లతో రాజస్తాన్‌ను చిత్తు చేసింది. రాజస్తాన్‌ 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితం కాగా...విదర్భ 14.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 87 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శనివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో తమిళనాడుతో హైదరాబాద్‌...విదర్భతో కర్నాటక తలపడతాయి. 

మరిన్ని వార్తలు