కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర కామెంట్‌!

17 Jan, 2022 19:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి వైదొలగడంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి అతను తప్పుకున్నట్లయ్యింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తర్వాత కోహ్లి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.  కోహ్లికి బీసీసీఐ ముందే ఏమైనా ఆంక్షలు పెట్టడంతోనే ఇలా చేశాడా? అని చర్చ మాత్రం అభిమానుల్లో విశ్లేషకుల్లో మొదలైంది. ఏది ఏమైనా కోహ్లి కెప్టెన్సీ కథ ముగిసింది. 

కాగా, ఇప్పుడు టీమిండియా టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్‌ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఇప్పట్లో టెస్టు కెప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో జట్టులోని కీలక ఆటగాళ్లు సారథ్యంపై ఏమౌతుందో అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే జస్ప్రిత్‌ బమ్రా.. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పని తాను చేసుకుపోవడమే కాకుండా మిగతా జట్టు సభ్యులకు సహాయం చేయాల్సి వస్తే తప్పకుండా చేయడమే తన కర్తవ్యమన్నాడు. ఒకవేళ కెప్టెన్సీ ఇచ్చినా తీసుకుంటాననే మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు. కెప్టెన్సీ అవకాశం వస్తే అదొక గౌరవంగా భావిస్తానని బుమ్రా చెప్పుకొచ్చాడు.  

ఇక్కడ చదవండి: కోహ్లి వారసుడి ఎంపికపై బీసీసీఐ అప్‌డేట్‌..!

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌కు డిప్యూటీగా పని చేసిన బుమ్రా.. పీటీఐ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.  ‘ నేను ఎవరు గురించో చెప్పడం లేదు. నా గురించి మాత్రమే చెబుతున్నా. నాకు ఏ బాధ్యత అప్పగించినా నా రోల్‌లో ఎటువంటి మార్పు ఉండదు. పదవీ ఉన్నా లేకపోయినా నేను ఏమీ చేయాలి అనే దానిపైనే నా ఫోకస్‌ ఉంటుంది. ఒక కొత్త బాధ్యత అనేది మనలోని ఏదో మార్పు తీసుకొస్తుందని నేను అనుకోను. నా జాబ్‌కు తొలి ప్రాధాన్యత. తర్వాతే మిగతాది. నాకు ప్రత్యేక బాధ్యత అప్పగించకపోయినా ఒత్తిడి అనేది ఉంటుంది. దాన్ని నేను తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటా. ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా మిగతా వారు కాదనడం నేను చూడలేదు. ఇక్కడ నేను కూడా అంతే’ అంటూ సారథ్య బాధ్యతలపై తన పేరును కూడా పరిశీలిస్తే బాగుంటుందనే విషయాన్ని సూత్రప్రాయంగా బీసీసీఐకి చేరవేశాడు బుమ్రా.

ఇక్కడ చదవండి: పాపం కోహ్లి.. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు..!

>
మరిన్ని వార్తలు