పాపం మనీశ్‌ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు!

11 Jun, 2021 20:32 IST|Sakshi

బెంగళూరు: అడపాదడపా భారత జట్టులో కనపడే కర్ణాటక స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మనీష్ పాండేపై అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సేట్‌ సానుభూతిని వ్యక్తం చేశాడు. మనీష్‌కు తగినన్ని అవకాశాలివ్వకుండా టీమిండియా మేనేజ్‌మెంట్‌ అతన్ని తోక్కేసిందని ఆరోపణలు గుప్పించాడు. అందరు క్రికెటర్లకులా మనీష్‌కు కూడా అవకాశాలు ఇచ్చి ఉంటే, ఈ పాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డాడు. మనీష్‌ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకకైనా అతనిపై చిన్నచూపు చూడటం మానుకుని, అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. 

నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే మనీష్‌ గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మనీష్.. పరిణితి చెందిన ఆటగాడని, సవాళ్లను ఇష్టపడతాడని, టెక్నిక్‌, వేగం కలబోసిన టాలెంట్‌ అతని సొంతమని ప్రశంసలు కురిపించాడు. అతనిప్పటి వరకు సరైన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రాలేదని, పూర్తి స్థాయి సిరీస్‌కు అవకాశమిస్తే తనేంటో తప్పక నిరూపించుకుంటాడని జోస్యం చెప్పాడు. కాగా, 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన మనీష్ పాండే.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే, తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున బరిలో నిలిచిన పాండే 73 బంతుల్లోనే 114 సూపర్‌ శతకాన్ని సాధించి అందరి మన్ననలు పొందాడు. ఆతర్వాత 2016లో ఆస్ట్రేలియాపై 81 బంతుల్లోనే శతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎందుకో ఏమో తెలీదు కానీ మనీష్‌కు ఆతర్వాత అవకాశాలు పలచబడ్డాయి. కాగా, మనీష్‌ ఇప్పటివరకు 26 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 492 పరుగులు చేశాడు. టీ20ల్లో 33 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ధశతకాల సాయంతో 709 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే మనీష్‌కు ఐపీఎల్‌లో మాత్రం మెరుగైన రికార్డే ఉంది. ఐపీఎల్‌లో 151 మ్యాచ్‌ల్లో శతకం, 20 అర్ధశతకాలతో సాయంతో 3461 పరుగులు చేశాడు.
చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు