IND VS AUS 4th Test: చారిత్రక రికార్డుపై కన్నేసిన టీమిండియా

8 Mar, 2023 12:14 IST|Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా రేపటి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్‌.. నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుని, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ బెర్తు కూడా ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్‌ సేన అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని ఓ చారిత్రక రికార్డుపై కూడా కన్నేసింది. 2013 నుంచి స్వదేశంలో వరుసగా 15 టెస్ట్‌ సిరీస్‌లు గెలిచిన భారత్‌.. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో విజయం సాధించినా లేక కనీసం డ్రా చేసుకున్నా, సొంతగడ్డపై వరుసగా 16వ టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది.

అంతర్జాతీయ క్రికెట్‌ ఏ ఇతర జట్టు కూడా స్వదేశంలో వరుసగా ఇన్ని టెస్ట్‌ సిరీస్‌లు గెలిచింది లేదు. ఈ విషయంలో ఏ జట్టు కూడా కనీసం టీమిండియా దరిదాపుల్లో లేదు. రెండో స్థానం‍లో ఉన్న ఆస్ట్రేలియా సొంతగడ్డపై రెండుసార్లు వరుసగా 10 టెస్ట్‌ సిరీస్‌లు గెలిచిం‍ది కానీ, టీమిండియా తరహాలో వరుసగా 15 సిరీస్‌లు గెలిచింది లేదు. ఈ జాబితాలో స్వదేశంలో 8 వరస సిరీస్‌ విజయాలతో వెస్టిండీస్‌ మూడో స్థానంలో ఉంది. గత పదేళ్లలో భారత్‌ స్వదేశంలో 45 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడగా.. 36 మ్యాచ్‌ల్లో గెలుపొంది, కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఓటమిపాలైంది. 

ఇదిలా ఉంటే, BGT-2023లో తొలి రెండు టెస్ట్‌ల్లో గెలుపొంది, 4 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేలా కనిపించిన రోహిత్‌ సేన అనూహ్యంగా మూడో టెస్ట్‌లో ఆసీస్‌ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్‌లో నాథన్‌ లయోన్‌ 11 వికెట్లతో పేట్రేగిపోవడంతో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన భారత్‌.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన రోహిత్‌ సేన, రెండో ఇన్నింగ్స్‌లో లయోన్‌ వీరలెవెల్లో విజృంభించడంతో (8/64) 163 పరుగులకే చాపచుట్టేసింది. భారత్‌ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (197) పరిమితమైన ఆసీస్‌.. టీమిండియా నిర్ధేశించిన 78 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.

అంతకుముందు భారత్‌.. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 132 తేడాతో, రెండో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. నాలుగో టెస్ట్‌ అనంతరం భారత్‌, ఆసీస్‌లు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనున్నాయి. తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే 19న విశాఖలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతుంది. 

మరిన్ని వార్తలు