Ind Vs Aus: చివరి నిమిషంలో అద్భుతం.. ఆరేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై భారత్‌ తొలి విజయం

1 Dec, 2022 10:21 IST|Sakshi

ఆరేళ్ల తర్వాత ఆసీస్‌పై గెలుపు

అడిలైడ్‌: ప్రపంచ నంబర్‌వన్, కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై భారత జట్టు ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌... సిరీస్‌లో నిలబడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది.

చివరకు 4–3 గోల్స్‌ తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 1–2కి తగ్గించింది. నాలుగో మ్యాచ్‌ శనివారం జరుగుతుంది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (12వ ని.లో), అభిషేక్‌ (47వ ని.లో), షంషేర్‌ సింగ్‌ (57వ ని.లో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌(60వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

ఆకాశ్‌దీప్‌ చివరి నిమిషంలో..
మ్యాచ్‌ చివరి నిమిషంలో ఆకాశ్‌దీప్‌ గోల్‌ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా తరఫున జాక్‌ వెల్చ్‌ (25వ ని.లో), ఆరాన్‌ జలెవ్‌స్కీ (32వ ని.లో), నాథన్‌ ఎఫరాముస్‌ (59వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు.  

నిర్ణీత సమయంలోపు ఫలితం తేలిన మ్యాచ్‌ల్లో భారత్‌ చివరిసారి 2016 నవంబర్‌ 29న ఆస్ట్రేలియాపై 3–2తో గెలిచింది. అనంతరం ఈ రెండు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 10 సార్లు ఆసీస్‌ నిర్ణీత సమయంలోపు నెగ్గగా... నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిసి వర్గీకరణ పాయింట్ల కోసం పెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం నిర్ణయించిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచింది. మరో మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది.    

చదవండి: Lionel Messi: ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా! అయినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ!
Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే..

మరిన్ని వార్తలు