Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్‌!? ద్రవిడ్‌, నువ్వూ కలిసి..

23 Dec, 2022 10:35 IST|Sakshi

మరోసారి విఫలమైన రాహుల్‌.. విమర్శల వర్షం

Bangladesh vs India, 2nd Test- KL Rahul- Rahul Dravid: టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి విఫలమయ్యాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. కాగా ఛటోగ్రామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో మొత్తంగా 45 పరుగులు మాత్రమే చేశాడు రాహుల్‌.

ఈ సిరీస్‌కు టీమిండియా సారథిగా వ్యవహరిస్తున్న అతడు.. మొదటి ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో 22 పరుగులు చేసి.. ఖలీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి అదే బౌలర్‌ చేతికి చిక్కి 23 పరుగుల(62 బంతుల్లో)కే పెవిలియన్‌ చేరాడు.

మరోసారి విఫలం
తాజాగా రెండో టెస్టులో కూడా కేఎల్‌ రాహుల్‌ కనీస పరుగులు కూడా స్కోర్‌ చేయలేకపోయాడు. మిర్పూర్‌ మ్యాచ్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 10 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఆట మొదలైన కాసేపటికే తైజుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

తొలి రోజు ఆటలో షకీబ్‌ బౌలింగ్‌(7.2)లో ఎల్బీడబ్ల్యూ కాకుండా లైఫ్‌ పొందిన రాహుల్‌.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. తైజుల్‌ వేసిన బంతి రాహుల్‌ ప్యాడ్స్‌ను తాకగా.. బంగ్లా రివ్యూకు వెళ్లగా సానుకూల ఫలితం వచ్చింది. దీంతో భారత సారథి నిరాశగా వెనుదిరిగాడు.

కాగా బంగ్లా టూర్‌లో భాగంగా వన్డే సిరీస్‌లో వరుసగా 73, 14, 8 పరుగులు చేసిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. మొదటి మ్యాచ్‌ మినహా మిగితా రెండింటిలో పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టు సిరీస్‌లోనూ ఇలా వైఫల్యం చెందుతున్న నేపథ్యంలో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ద్రవిడ్‌, నువ్వూ కలిసి..
ముఖ్యంగా రెండో టెస్టు ఆరంభానికి ముందు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శనంలో బ్యాటింగ్‌ ప్రాక్టీసు చేసిన రాహుల్‌.. ఇలా ఆదిలోనే వికెట్‌ సమర్పించుకోవడంతో నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ద్రవిడ్‌ స్పెషల్‌గా నీకు పాఠాలు నేర్పినా నీ ఆట తీరు మారడం లేదు. 

పనికిరాని వాడివంటూ ఆగ్రహం
నీ స్థానంలో మరో బ్యాటర్‌ ఉంటే కచ్చితంగా జట్టు నుంచి తీసేసేవాళ్లు. ఈ సిరీస్‌కు లక్కీగా కెప్టెన్‌ అయ్యావు కాబట్టి సరిపోయింది. లేదంటే జట్టులో స్థానమే ఉండేది కాదు. టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నావు. నీకేమైంది రాహుల్‌’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

మరికొంత మంది.. ‘‘పనికిరాని రాని రాహుల్‌ను పక్కన పెట్టకుండా కెప్టెన్‌ను చేశారు. పరిమిత, సంప్రదాయ క్రికెట్‌లో అతడి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయినా ఛాన్స్‌లు ఇస్తారు’’అంటూ మండిపడుతున్నారు. ఇంకొంత మంది నువ్వు రిటైర్‌ అవ్వు.. అప్పుడే జట్టు బాగుపడుతుంది అని ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

ఇద్దరు ఓపెనర్లు అవుట్‌
ఇక గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సైతం విఫలమయ్యాడు. తైజుల్‌ స్పిన్‌ మాయాజాలంలో చిక్కిన అతడు.. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తున్న తరుణంలో బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ స్పిన్నర్లతో వరుస ఓవర్లు వేయిస్తున్నాడు. 

చదవండి: Ind Vs Ban: మర్యాదపూర్వక పదం వాడలేకపోతున్నా.. టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు..
వేలంలో.. ఆ అఫ్గన్‌ యువ బౌలర్‌ సూపర్‌స్టార్‌! స్టోక్స్‌, ఉనాద్కట్‌ కోసం పోటీ: మిస్టర్‌ ఐపీఎల్‌

మరిన్ని వార్తలు