Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా..

15 Jul, 2022 10:27 IST|Sakshi
భారత జట్టు(PC: BCCI)

India Vs England ODI Series 2022: 2nd ODI - Rohit Sharma Comments: ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ గెలవాలన్న టీమిండియా ఆశలపై ఆతిథ్య జట్టు నీళ్లు చల్లింది. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో మాంచెస్టర్‌ వేదికగా జరుగనున్న మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది.

మొన్న బుమ్రా.. ఇప్పుడు టాప్లీ..
కాగా మొదటి వన్డేలో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను మట్టికరిపిస్తే.. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ రీస్‌ టాప్లీ అదే తరహాలో రాణించాడు. కీలక బ్యాటర్ల వికెట్లు తీసి భారత్‌ జట్టు పతనాన్ని శాసించాడు. 9.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 24 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అందుకే ఓడిపోయాం
ఇక ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని, అయితే.. బ్యాటర్లే రాణించలేకపోయారని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘మా బౌలింగ్‌ ఆరంభంలో బాగానే ఉంది. అయితే, మొయిన్‌ అలీ, విల్లే మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశారు.

అయినంత మాత్రాన ఇంగ్లండ్‌ విధించిన లక్ష్యం మరీ ఛేదించలేనంత పెద్దదేం కాదు. నిజానికి ఈరోజు మా బ్యాటింగ్‌ బాగాలేదు’’ అని ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. అదే విధంగా.. ‘‘కొన్ని క్యాచ్‌లు కూడా జారవిడిచాం. ఏదేమైనా మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు.నిజానికి ఈ పిచ్‌ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది అనుకున్నాం. కానీ అలా జరుగలేదు. టాపార్డర్‌లో ఒక్క బ్యాటర్‌ అయినా నిలకడగా ఆడలేకపోవడం దెబ్బతీసింది. మాంచెస్టర్‌ మ్యాచ్‌  కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పరిస్థితులకు తగ్గట్లుగా మెదులుతూ మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో వన్డే:
వేదిక: లార్డ్స్‌, లండన్‌
టాస్‌: ఇండియా- బౌలింగ్‌
ఇంగ్లండ్‌ స్కోరు: 246 (49)
ఇండియా స్కోరు: 146 (38.5)
విజేత: ఇంగ్లండ్‌.. 100 పరుగుల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రీస్‌ టాప్లీ(9.5 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 6 వికెట్లు)

చదవండి: ICC ODI WC Super League: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్‌.. ఏడో స్థానంలో రోహిత్‌ సేన!
Heinrich Klaseen: క్లాసెన్‌ సుడిగాలి శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌

మరిన్ని వార్తలు