చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ గెలిపించిన కోహ్లి

15 Mar, 2021 03:32 IST|Sakshi

రెండో టి20లో భారత్‌ ఘనవిజయం

అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టాడు. కెప్టెన్‌ కోహ్లితో కలిసి వేగంగా పరుగులు జతచేశాడు. సారథి కంటే వేగంగా ఫిఫ్టీ చేశాడు. తర్వాత కోహ్లి కూడా ఛేదనలో తనకు ఎదురులేని ఆట ఆడటంతో లక్ష్యాన్ని దించేంత దాకా భారత్‌కు ఏ ఇబ్బందీ రాలేదు. తొలి టి20లో ఎదురైన ఓటమిని మర్చిపోయేలా టీమిండియా మెరిసింది. అలవోక విజయంతో సిరీస్‌ను 1–1తో సమం చేసింది.

అహ్మదాబాద్‌: భారత్‌ పుంజుకుంది. ప్రపంచ నంబర్‌వన్‌ టి20 జట్టు ఇంగ్లండ్‌ ఆధిక్యానికి దూకుడుగా బదులిచ్చింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో మోర్గాన్‌ బృందంపై విజయం సాధించింది. యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. ఐదు టి20ల సమరంలో ఇరుజట్లు ఇప్పుడు 1–1తో సమంగా నిలిచాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం భారత్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇషాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులు చేసింది. శిఖర్‌ ధావన్, అక్షర్‌ పటేల్‌ల స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. మూడో మ్యాచ్‌ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. 

ఇ‘షాన్‌దార్‌’ ఫిఫ్టీ 
సగటున ఓవర్‌కు 8 పైచిలుకు పరుగుల లక్ష్యం. కానీ... తొలి ఓవర్లోనే రాహుల్‌ (0) డకౌటయ్యాడు. ఇషాన్‌కు కెప్టెన్‌ కోహ్లి జతయ్యాడు. ఇద్దరు మొదట చూసి ఆడుకున్నారు. తర్వాత లక్ష్యానికి తగ్గట్లే బ్యాట్‌కు పనిచెప్పారు. ముఖ్యంగా ఇషాన్‌ దూకుడు కనబరిచాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసేందుకు వచ్చిన టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్‌... కవర్స్, స్క్వేర్‌ దిశగా రెండు చూడముచ్చటైన బౌండరీలు బాదాడు. అనంతరం స్టోక్స్‌కు కోహ్లి, ఇషాన్‌ సిక్సర్లతో స్వాగతం పలికారు.   

గెలిచేదాకా నిలిచిన కెప్టెన్‌ 
భారీ షాట్లలో నాయకుడినే మించిపోయిన ఇషాన్‌ కిషన్‌... రషీద్‌ వేసిన పదో ఓవర్లో డీప్‌ మిడ్‌వికెట్, లాంగాన్‌ దిశగా కళ్లు చెదిరేలా వరుస సిక్సర్లు కొట్టాడు. అలా 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. కానీ అదే ఓవర్‌ ఆఖరి బంతికి వికెట్ల ముందు దొరికిపోవడంతో రెండో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పంత్‌ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వచ్చీరాగా నే ఇంగ్లండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇతన్ని జోర్డాన్‌ బోల్తా కొట్టించగా... ఆఖరి 6 ఓవర్లలో భారత్‌ విజయానికి 32 పరుగులు చేయాలి. ఈ దశలో అయ్యర్‌ (8 నాటౌట్‌) అండతో కోహ్లి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

రాణించిన రాయ్‌ 
అంతకుముందు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తీసికట్టుగా ఏమీ సాగలేదు. బట్లర్‌ (0) డకౌట్‌ అయినా మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తన సహజసిద్ధమైన దూకుడు కనబరిచాడు. మలాన్‌ (24; 4 ఫోర్లు) అవుటయ్యాక ... రాయ్, బెయిర్‌స్టో (20; 1 ఫోర్, 1 సిక్స్‌) జోరు కాసేపు కొనసాగింది. అయితే స్పిన్నర్‌ సుందర్‌ వీరిద్దరిని అవుట్‌ చేయడంతో స్కోరు వేగానికి అడ్డుకట్ట పడింది. ఆఖర్లో కెప్టెన్‌ మోర్గాన్‌ (20 బంతుల్లో 28; 4 ఫోర్లు), స్టోక్స్‌ (21 బంతుల్లో 24; 1 ఫోర్‌) ధాటిగా ఆడారు. వీరిని శార్దుల్‌ అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ జోరుకు బ్రేక్‌ పడింది.

►అరంగేట్రం మ్యాచ్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకున్న నాలుగో భారత క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌. గతంలో మోహిత్‌ శర్మ (2013లో జింబాబ్వేపై), పృథ్వీ షా (2018లో వెస్టిండీస్‌పై), నవదీప్‌ సైనీ (2019లో వెస్టిండీస్‌పై) ఈ ఘనత సాధించారు. 

►అరంగేట్రం టి20 మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌. గతంలో రహానే (2011లో ఇంగ్లండ్‌పై) ఈ ఘనత సాధించాడు.

►అంతర్జాతీయ టి20ల్లో 3000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) సుందర్‌ 46; బట్లర్‌ (ఎల్బీ) (బి) భువనేశ్వర్‌ 0; మలాన్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 24; బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్‌ (బి) సుందర్‌ 20; మోర్గాన్‌ (సి) పంత్‌ (బి) శార్దుల్‌ 28; స్టోక్స్‌ (సి) పాండ్యా (బి) శార్దుల్‌ 24; స్యామ్‌ కరన్‌ (నాటౌట్‌) 6; జోర్డాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–1, 2–64, 3–91, 4–119, 5–142, 6–160. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–28–1, సుందర్‌ 4–0–29–2, శార్దుల్‌ 4–0–29–2, పాండ్యా 4–0–33–0, చహల్‌ 4–0–34–1. 
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) స్యామ్‌ కరన్‌ 0; ఇషాన్‌ కిషన్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 56; కోహ్లి (నాటౌట్‌) 73; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) జోర్డాన్‌ 26; అయ్యర్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–94, 3–130. 
బౌలింగ్‌: స్యామ్‌ కరన్‌ 4–1–22–1, ఆర్చర్‌ 4–0–24–0, జోర్డాన్‌ 2.5–0–38–1, టామ్‌ కరన్‌ 2–0–26–0, స్టోక్స్‌ 1–0–17–0, రషీద్‌ 4–0–38–1. 

మరిన్ని వార్తలు