రూత్‌లెస్‌ రూట్‌.. టీమిండియాపై పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

6 Jul, 2022 13:35 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్ట్‌లో సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో 28వ శతకం నమోదు చేసిన రూట్‌.. కోహ్లి (27), స్టీవ్‌ స్మిత్‌ (27) శతకాల రికార్డును అధిగమించడంతో పాటు మరో రికార్డునూ నెలకొల్పాడు. టీమిండియాపై 9వ టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన రూట్‌.. ఆసీస్‌ మాజీ కెప్టెన్లు స్టీవ్‌ స్మిత్‌, రికీ పాం‍టింగ్‌, విండీస్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్‌ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 

స్మిత్‌, పాంటింగ్‌, రిచర్డ్స్‌, సోబర్స్‌లు టీమిండియాపై 8 టెస్ట్‌ సెంచరీలు సాధిస్తే.. రూట్‌ వారందరినీ అధిగమించి అత్యధికంగా 9 సెంచరీలు బాదాడు. కెరీర్‌ మొత్తంలో 121 టెస్ట్‌లు ఆడిన రూట్‌.. 5 డబుల్‌ సెంచరీలు, 28 సెంచరీలు, 54 అర్ధసెంచరీల సాయంతో 50.77 సగటున 10458 పరుగులు స్కోర్‌ చేశాడు. టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల పటౌడీ ట్రోఫీలో 4 సెంచరీల సాయంతో 737 పరుగులు బాదిన రూట్‌.. గత 24 టెస్ట్‌ల్లో 11 సెంచరీలు, 28 అర్ధసెంచరీల సాయంతో 3000 పైచిలుకు పరుగులు సాధించడం విశేషం. 
చదవండి: టీమిండియాకు పరాభవం.. ఇంగ్లండ్‌కు చిరస్మరణీయం

మరిన్ని వార్తలు