IND Vs SA T20: డీకేను సెలక్ట్‌ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు

23 May, 2022 17:31 IST|Sakshi
దినేశ్‌ కార్తిక్‌, శిఖర్‌ ధావన్‌

India Vs South Africa T20 Series: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్ల తీరును టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా విమర్శించాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఎంపిక చేసిన జట్టులో సీనియర్‌ బ్యాటర్‌కు శిఖర్‌ ధావన్‌కు ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించాడు. దినేశ్‌ కార్తిక్‌ను జట్టులోకి తీసుకున్నపుడు ధావన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశాడు.

కాగా దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్‌-2022లో అదరగొట్టిన యువ బౌలర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకోగా.. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ జట్టులోకి వచ్చారు.

కానీ, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న  శిఖర్‌ ధావన్‌(పంజాబ్‌ కింగ్స్‌- 460 పరుగులు- అత్యధిక స్కోరు 88 నాటౌట్‌)కు మాత్రం మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో సురేశ్‌ రైనా మాట్లాడుతూ.. ‘‘శిఖర్‌ ధావన్‌ను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేయాల్సింది. తను జట్టులో ఉంటే ఎంతో బాగుంటుంది. డ్రెస్సింగ్‌రూంలో వాతావరణాన్ని తేలికపరిచి అందరితో కలిసిపోతాడు.

దినేశ్‌ కార్తిక్‌ పునరాగమనం చేయగలుగుతున్నపుడు శిఖర్‌ ధావన్‌ ఎందుకు జట్టులోకి రాకూడదు’’ అని సెలక్టర్ల తీరును ప్రశ్నించాడు. కాగా శిఖర్‌ ధావన్‌ ఆఖరిసారిగా గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌-2021 సమయంలో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇదిలా ఉంటే ప్రొటిస్‌తో సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన జట్టుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు.

చదవండి👉🏾IPL 2022: ‘టాప్‌-4’లోని ఒక్కడు తప్ప ఆ కెప్టెన్లంతా అదరగొట్టారు.. అగ్రస్థానం అతడిదే!
చదవండి👉🏾IPL 2022: ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయితే..?

మరిన్ని వార్తలు