Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్‌, రుతు​.. ఇంకా 

3 Jan, 2023 09:49 IST|Sakshi

India vs Sri Lanka, 1st T20I- ముంబై: ఈ కొత్త సంవత్సరం భారత యువ క్రికెటర్లకు లక్కీ చాన్స్‌ ఇస్తోంది. స్టార్లు లేని టీమిండియాలో ఓ పూర్తి స్థాయి సిరీస్‌ ఆడేందుకు చక్కని అవకాశం కల్పించింది. ముఖ్యంగా టాపార్డర్‌లో సత్తా చాటుకునేందుకు కుర్రాళ్లకు ఇంతకు మించిన సదవకాశం ఉండదేమో!

భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో మూడు టి20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ మంగళవారం వాంఖడేలో జరుగుతుంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో నూతన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇన్నాళ్లు అడపాదడపా ఓపెనింగ్‌లో అవకాశాలు పొందిన ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్‌లు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో సత్తా చాటుకోవాలి. ముఖ్యంగా పవర్‌ప్లేలో తమ బ్యాటింగ్‌ పవర్‌ చూపించాల్సిందే!  

‘సూర్య’ ప్రతాపం కొనసాగేనా 
గతేడాది ఆసాంతం సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులు మెరిపించాడు. ఒక్క ఏడాదిలోనే ఐసీసీ టి20 బ్యాటింగ్‌ ర్యాంకుల్లో అగ్ర స్థానానికి ఎగబాకాడు. ముఖ్యంగా ప్రతీ సిరీస్‌లోనూ తన మార్కు ఆటతీరుతో రాణించాడు. భారత 360 డిగ్రీ బ్యాటర్‌గా రూపాంతరం చెందాడు. ప్రత్యర్థి పేస్‌ బౌలర్ల పాలిట సూర్య ప్రతాపం ఎంత చెప్పకున్నా తక్కువే.

ఇదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో సూర్య ఉన్నాడు. రోహిత్, కోహ్లి, రాహుల్‌ లేని టాప్‌ ఆర్డర్‌కు సూర్యకుమారే ఇప్పుడు పెద్ద దిక్కు. పెరిగిన బాధ్యతలతో జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వుంటుంది.

పగ్గాలు అప్పగించిన ప్రతీసారీ నిరూపించుకున్న హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ మెరుపులు కూడా తోడయితే లంకేయులకు కష్టాలు తప్పవు. మిడిలార్డర్‌లో దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌లే కూడా బ్యాటింగ్‌లో బాధ్యతను పంచుకుంటే తక్కువ దూరంలో బౌండరీ ఉన్న వాంఖెడేలో భారీ స్కోర్లు ఏమంత కష్టం కానేకాదు.  

అర్ష్‌దీప్‌పై భారం 
ప్రస్తుత భారత జట్టులో అనుభవజ్ఞులైన పేసర్లు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే జట్టులో ఇప్పుడున్న ఏకైక సీనియర్‌ బౌలర్‌ చహల్‌ ఒక్కడే! అతను స్పిన్‌తో కట్టడి చేయగలడు. అయితే సీమ్‌ బౌలింగ్‌ను నడిపించేది మాత్రం అర్ష్‌దీప్‌ సింగే.

గడచిన ఐదారు నెలల్లో అర్ష్‌దీప్‌ తన పేస్‌ వాడి ఏంటో చూపెట్టాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అతని ప్రతిభను గుర్తించి పదేపదే అవకాశాలిస్తోంది. స్పీడ్‌తో ఉమ్రాన్‌ మాలిక్, పేస్‌ వైవిధ్యంతో హర్షల్‌ పటేల్, స్పిన్‌తో వాషింగ్టన్‌ సుందర్‌ ప్రత్యర్థి బ్యాటింగ్‌కు ఏ మేరకు కళ్లెం వేయగలరో చూడాలి. 

ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! 
శ్రీలంక మిగతా ఫార్మాట్లలో ఎలా వున్నప్పటికీ పొట్టి ఫార్మాట్‌లో గట్టి ప్రత్యర్థే! ఆసియా కప్‌ టి20 చాంపియన్‌ శ్రీలంక జట్టులో మెరుపులు మెరిపించే బ్యాటర్స్‌కు కొదవే లేదు. కెప్టెన్‌ షనక, నిసాంక, కుశాల్‌ మెండిస్, భానుక రాజపక్స, సమరవిక్రమ అందరు మంచి ఫామ్‌లో ఉన్నారు.

పైగా అనుభవజ్ఞులు లేని భారత బౌలింగ్‌పై వీళ్లు విరుచుకుపడితే భారీ స్కోర్లకు కొరత ఉండదు. బౌలింగ్‌ విషయానికి వస్తే హసరంగ స్పిన్‌ మ్యాజిక్‌తో పాటు తీక్షణ, మదుశంక, లహిరు కుమారల రూపంలో శ్రీలంక బౌలింగ్‌ మెరుగ్గానే ఉంది.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్, సూర్యకుమార్,  సామ్సన్, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్, చహల్, హర్షల్, అర్ష్‌దీప్‌, ఉమ్రాన్‌ మాలిక్‌. 
శ్రీలంక: దసున్‌ షనక (కెప్టెన్‌), నిసాంక, కుశాల్‌ మెండిస్, ధనంజయ, అసలంక, చమిక కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, లహిరు కుమార. 

పిచ్‌–వాతావరణం 
వాంఖెడే పిచ్‌ ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్‌లో మెరుపులకు చక్కని అవకాశం కల్పిస్తుంది. దీంతో భారీ స్కోర్లు ఖాయం. మంచు ప్రభావం వల్ల టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంటుంది. వర్షం ముప్పు లేదు.
చదవండి: టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవాకు ఒకేసారి రెండు క్యాన్సర్‌లు 
Pele: చివరి చూపు కోసం...

మరిన్ని వార్తలు