Deepak Chahar: ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడాలనేది కల.. ఈరోజుతో నెరవేరింది

21 Jul, 2021 12:13 IST|Sakshi

కొలంబో: ''ఈ ప్రదర్శనే నేను కలగన్నది.. ఈరోజుతో నెరవేరింది.. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మంచి ఇన్నింగ్స్‌ ఆడాను.. దేశానికి విజయం అందించడం గర్విస్తున్నా'' అంటూ దీపక్‌ చహర్‌ మ్యాన్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అందుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌తో అభిమానులకు హీరోగా మారిపోయాడు. దీపక్‌ చహర్‌ ఈ ఇన్నింగ్స్‌ను టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆడాడే కాబట్టే అంత క్రేజ్‌ వచ్చింది.

అయినా టీమిండియా ఆడుతోంది.. శ్రీలంకతోనే కదా అని చిన్నచూపు మాత్రం చూడొద్దు. వాస్తవానికి లంక జట్టు ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగా‍ల్లో టీమిండియాతో సమానంగా నిలిచింది. దానికి ఉదాహరణే రెండో వన్డే.. మొదట బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి 193 పరుగులకే భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత దీపక్‌ చహర్‌, భువనేశ్వర్‌తో కలిసి చిరస్మరణీయ భాగస్వామ్యం నమోదు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్న చహర్‌ స్పందించాడు. 

'దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్‌ ద్రవిడ్ సర్‌ చెప్పారు. ఆయన కోచింగ్‌లో నేను భారత్‌-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడాను. ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్‌ రాదనే అనుకుంటున్నా. లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకుముందు మాత్రం ఒక్కో బంతిని ఆడుతూ పరుగులు చేశా. నా ఇన్నింగ్స్‌ సమయంలో కోచ్‌ ద్రవిడ్‌ డ్రింక్స్‌ బాయ్‌గా ఉన్న నా సోదరుడు రాహుల్‌ చహర్‌కు బ్యాటింగ్‌ పరంగా కొన్ని కీలక సూచనలు ఇచ్చి పంపించాడు. డ్రింక్స్‌ విరామం సమయంలో రాహుల్‌ నా దగ్గరకు వచ్చి ద్రవిడ్‌ సూచనలు అందించాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా.ఈరోజుతో అది నెరవేరింది.' అని పేర్కొన్నాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు