Suryakumar Yadav: అవును.. సూర్య ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బెటర్‌! ఐసీసీ ఈవెంట్లలో..

3 Aug, 2022 12:39 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌(PC: BCCI)

India Vs West Indies 3rd T20- Suryakuma Yadav: వెస్టిండీస్‌తో మూడో టీ20లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి 76 పరుగులు సాధించాడు. తద్వారా భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు సూర్య.

కాగా నాలుగో స్థానంలో అద్భుతంగా రాణించే ఈ ముంబై బ్యాటర్‌ను విండీస్‌ పర్యటనలో ఓపెనర్‌గా పంపడంపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా సూర్య నిరాశపరచడం(వరుసగా 24,11)తో మాజీ సారథి క్రిష్టమాచారి శ్రీకాంత్‌ సహా పలువురు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

అయితే, రోహిత్‌ శర్మ మాత్రం ఎప్పటికప్పుడు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2022 సన్నాహకాల్లో భాగంగానే ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో సూర్య రాణించడంతో టీమిండియా, ఫ్యాన్స్‌ ఖుషీ అవుతుండగా.. భారత జట్టు మాజీ సెలక్టర్‌, వికెట్‌ కీపర్‌ సబా కరీం మాత్రం భిన్నంగా స్పందించాడు.


సబా కరీం

నాలుగో స్థానంలో వస్తేనే!
ఈ మ్యాచ్‌లో సూర్య ఓపెనర్‌గా రాణించినా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానమే అతడికి అత్యుత్తమమైందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో సూర్యను మిడిలార్డర్‌లో ఆడిస్తేనే ఫలితం బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఇండియా న్యూ స్పోర్ట్స్‌తో సబా కరీం మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ ఈవెంట్లలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానం అనేది అత్యంత కీలకమైనది.

అక్కడ సూర్యకుమార్‌ లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంటుంది. పేసర్లనైనా.. స్పిన్నర్లనైనా అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. మెరుగైన స్ట్రైక్‌ రేటుతో బ్యాటింగ్‌ చేయగలడు. ఇప్పటికీ తను నాలుగో స్థానానికి మాత్రమే సరైనవాడని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నాడు. 

అవును మిడిలార్డర్‌లో అయితేనే!
టీమిండియా మరో మాజీ క్రికెటర్‌ రితీందర్‌ సోధి సైతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే పలు అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి సూర్యకుమార్‌ తానేంటో నిరూపించుకున్నాడన్నాడు. అతడు అత్యుత్తమ మిడిలార్డర్‌ బ్యాటర్‌ అని కొనియాడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితేనే సూర్య మరింత గొప్పగా రాణించగలుగుతాడని అభిప్రాయపడ్డాడు.

కాగా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఆఖరిదైన మూడో టీ20లో సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక విండీస్‌ టూర్‌లో భాగంగా మూడో టీ20లో అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్‌ సేన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.  ఇరు జట్ల మధ్య శనివారం(ఆగష్టు 6) నాలుగో టీ20 మ్యాచ్‌ జరుగనుంది.

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా మూడో టీ20:
►వేదిక: వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌, వెస్టిండీస్‌
►టాస్‌: ఇండియా- బౌలింగ్‌
►వెస్టిండీస్‌ స్కోరు: 164/5 (20)
►ఇండియా స్కోరు: 165/3 (19)

►విజేత: ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
►ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఇండియా ముందంజ
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సూర్యకుమార్‌ యాదవ్‌(44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 76 పరుగులు)
చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌.. బీసీసీఐ కీలక అప్‌డేట్‌.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్‌!

మరిన్ని వార్తలు