Dinesh Karthik: నిజంగా వాళ్లిద్దరు గ్రేట్‌! ప్రపంచకప్‌ జట్టులో మనిద్దరం ఉండాలి!

30 Jul, 2022 16:42 IST|Sakshi
దినేశ్‌ కార్తిక్‌- రవిచంద్రన్‌ అశ్విన్‌(PC: BCCI)

India VS West Indies 1st T20: టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు. తన పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. తను విజయవంతమైనా, విఫలమైనా ఏమాత్రం భేదభావం చూపుకుండా మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. 

కాగా ఐపీఎల్‌-2022లో సత్తా చాటిన 37 ఏళ్ల దినేశ్‌ కార్తిక్‌.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో భారత జట్టులో పునరాగమనం చేశాడు. టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.

ఇక విండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమిండియా 190 పరుగుల మేర భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. తద్వారా విజయంలో భాగమై ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

అదే వాళ్లిద్దరి గొప్పతనం! నా లక్ష్యం అదే!
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సహచర ఆటగాడు, భారత స్టార్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో సంభాషిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ‘‘గత జట్లతో పోలిస్తే ఇప్పుడున్న భారత జట్టు చాలా కొత్తగా ఉంది. నేను ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ముఖ్యంగా కోచ్‌, కెప్టెన్‌ వ్యవహారశైలి. ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లిద్దరికే దక్కుతుంది.

వైఫల్యాలు ఎదురైనా ఆటగాళ్లను చిన్నబుచ్చకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేస్తున్నారు. ఇంతకు ముందు ఇలా లేదు. ఇప్పుడు నేను బాగా ఆడినా.. ఆడకపోయినా నన్ను ట్రీట్‌ చేసే విధానం ఒకేలా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక రానున్న పొట్టి ఫార్మాట్‌ ఈవెంట్‌లో బాగా ఆడటమే తన ముందున్న లక్ష్యమన్న డీకే.. జట్టు విజయాల్లో ఇద్దరం భాగమైతే బాగుంటుందంటూ అశ్విన్‌తో వ్యాఖ్యానించాడు.

ఇక తొలి టీ20లో విజయంతో రోహిత్‌ సేన విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటికే శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని వన్డే జట్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: Ind Vs WI 1st T20: అతడిని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు! ద్రవిడ్‌ కాదు.. నువ్వేమనుకుంటున్నావు?

మరిన్ని వార్తలు