Sanju Samson: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అంతే! నాకైతే గొప్పగా అనిపిస్తోంది!

21 Aug, 2022 11:59 IST|Sakshi
టీమిండియా సంబరం(PC: BCCI)

India Vs Zimbabwe 2nd ODI- Sanju Samson Comments: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 42 బంతుల్లో 77 పరుగులు... వెస్టిండీస్‌ పర్యటలో వన్డే సిరీస్‌లో భాగంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి వన్డేలో 12 పరుగులు.. రెండో మ్యాచ్‌లో 54 పరుగులు.. మూడో వన్డేలో 6 పరుగులు(నాటౌట్‌)..

ఇక టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌లో 30 పరుగులు(నాటౌట్‌).. తాజాగా జింబాబ్వేతో రెండో వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 39 బంతుల్లో 43 పరుగులు.. తద్వారా భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అవార్డు.. ఈ ఉపోద్ఘాతమంతా టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ గురించే!

ఆఖరి వరకు అజేయంగా నిలిచి..
అడపాదడపా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు ఈ కేరళ బ్యాటర్‌. జింబాబ్వే పర్యటనలో భాగంగా రెండో వన్డేలో 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ సేన తడబడుతున్న సమయంలో సంజూ ఆదుకున్నాడు. 39 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 43 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తద్వారా కెరీర్‌లో తొలి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఏ స్థానంలో దిగినా అద్భుతాలు చేస్తాడు!
ఈ నేపథ్యంలో సంజూపై టీమిండియా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంజూ శాంసన్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా పరుగుల మోత మోగాల్సిందేనంటూ అతడిని ఆకాశానికెత్తుతున్నారు. ‘‘దురదృష్టవశాత్తూ సంజూకు వచ్చే అవకాశాలే తక్కువ. అయినా తను ఏమాత్రం విశ్వాసం కోల్పోడు. 

ఆత్మన్యూనతకు లోనుకాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనను తాను నిరూపించుకుని శెభాష్‌ అనిపించుకుంటాడు. ఈ విషయంలో చాలా మంది యువ ఆటగాళ్లు అతడిని చూసి నేర్చుకోవాలి’’ అంటూ సంజూను కొనియాడుతున్నారు.

గొప్పగా అనిపిస్తుంది! 
ఇక మిడిలార్డర్‌లో ఎక్కువగా ఆడే సంజూ శాంసన్‌.. మ్యాచ్‌ అనంతరం తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘మిడిలార్డర్‌లో ఎంత ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేయగలిగితే ఆ ఫీలింగ్‌ అంత బాగుంటుంది. ముఖ్యంగా దేశం కోసం ఆడుతున్నపుడు ఈ భావన మరింత గొప్పగా ఉంటుంది.

నేను ఈ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్నాను. ఏదేమైనా ప్రస్తుతం నేను వికెట్‌ కీపింగ్‌.. బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నా. మా బౌలర్లు ఈ మ్యాచ్‌లో అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న సమయంలో బంతులో నా చేతిలో పడ్డ తీరే ఇందుకు నిదర్శనం’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

సంజూ కీలక ఇన్నింగ్స్‌.. సిరీస్‌ కైవసం
కాగా హరారే వేదికగా శనివారం(ఆగష్టు 21) జరిగిన రెండో వన్డేలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జింబాబ్వే 161 పరుగులకే ఆలౌట్‌ అయింది. శార్దూల్‌ ఠాకూర్‌ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ సంజూ.. సిరాజ్‌ బౌలింగ్‌లో ఒకటి, శార్దూల్‌ బౌలింగ్‌లో ఒకటి, ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఒకటి.. ఇలా మొత్తంగా మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. సిరాజ్‌తో కలిసి ఓ రనౌట్‌లోనూ భాగమయ్యాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత బ్యాటర్లలో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (1 పరుగు), ఇషాన్‌ కిషన్‌(6 పరుగులు) విఫలం కాగా శిఖర్‌ ధావన్‌ 33, శుబ్‌మన్‌ గిల్‌ 33, దీపక్‌ హుడా 25 పరుగులతో రాణించారు.

సంజూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి 43 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్‌.. ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

చదవండి: IND vs ZIM: దీపక్‌ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
Asia Cup 2022: 'ఆఫ్రిదికి అంత సీన్‌ లేదు.. దమ్ముంటే గెలిచి చూపించండి'

>
మరిన్ని వార్తలు