IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్‌

5 Dec, 2022 21:18 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఓటమితో బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ గట్టి షాక్‌ ఇచ్చింది. బంగ్లాతో తొలి వన్డేలో స్లోఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 80శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా షెడ్యూల్ సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోతే 20 శాతం మ్యాచ్ ఫీజుని పెనాల్టీని విధిస్తారు. అయితే తొలి వన్డేలో టీమిండియా... ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో తక్కువ వేసిన ఒక్కో ఓవర్‌కి 20 శాతం చొప్పున 80 శాతం మ్యాచ్ ఫీజును కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.

''ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడం జరుగుతుంది.మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే, టీమిండియా నెట్ ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించారు'' అంటూ ఐసీసీ తన ట్విటర్‌లో పేర్కొంది. కాగా స్లో ఓవర్ రేటుపై రిఫరీకి క్షమాపణలు తెలిపిన రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజు కోతకి అంగీకరించాడు. దీంతో తొలి వన్డేలో ఆడిన టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌ ఫీజు కింద కేవలం 20 శాతం మాత్రమే అందుకోనున్నారు. 

ఇక ఢాకాలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా బౌలర్లు కూడా చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్‌ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరొక వికెట్ తీస్తే చాలు, టీమిండియాదే విజయం అనుకుంటున్న సమయంలో మెహిడీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మన్ కలిసి 10వ వికెట్‌కి 51 పరుగులు జోడించి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు.

2019లో కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌ ఓడిపోయిన రోహిత్ శర్మ, వన్డే మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవిచూశాడు. బంగ్లాదేశ్‌పై టీ20, వన్డేల్లో ఓటమి చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు . ఇరు జట్ల మధ్య డిసెంబర్ 7న(బుధవారం) రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిన భారత జట్టు రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ సమం చేయాలని  భావిస్తోంది. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్..రోహిత్ సేనపై ఇదే రిజల్ట్‌ని రిపీట్ చేయాలని భావిస్తోంది.

చదవండి: FIFA: మ్యాచ్‌ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా?

ఫలితం రాదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అద్బుతం

మరిన్ని వార్తలు