చెన్నైలో చెస్‌ ఒలింపియాడ్‌

17 Mar, 2022 04:46 IST|Sakshi

ఆంక్షలతో రష్యా నుంచి తరలింపు

సాక్షి, చెన్నై: భారత చెస్‌ రాజధాని చెన్నై మరో మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత మరో ప్రధాన టోర్నీ అయిన ‘చెస్‌ ఒలింపియాడ్‌’ ఈ ఏడాది చెన్నైలో జరగనుంది. ఉక్రెయిన్‌పై అనైతిక యుద్ధం చేస్తోన్న రష్యాకు కట్టబెట్టిన ఆతిథ్య హక్కుల్ని ఇదివరకే రద్దు చేసిన ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడే) తాజాగా కొత్త వేదికను ఖరారు చేసింది. అయితే తేదీలు తదితర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

ముందనుకున్న షెడ్యూలు ప్రకారమైతే మాస్కోలో జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు ఈ టీమ్‌ ఈవెంట్‌ జరగాల్సి ఉంది. చెన్నైలోనూ ఇదే షెడ్యూలులో నిర్వహిస్తారా లేదం టే కొత్త తేదీల్ని ప్రకటిస్తారనేదానిపై స్పష్టత రాలే దు.  తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ చెన్నై లో మెగా టోర్నీ విషయాన్ని ప్రకటించారు. ‘భారత చెస్‌ క్యాపిటల్‌కు చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్య భాగ్యం దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇది తమిళనాడుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.

ప్రపంచంలోని చదరంగ రాజులు, రాణులకు (ప్లేయర్లు)కు చెన్నై స్వాగతం పలుకుతోంది’ అని తమిళ సీఎం స్టాలిన్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఆలిండియా చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) కూడా ఆతిథ్య వేదికగా చెన్నై ఖరారైందని వెల్లడించింది. ‘ఫిడే’ రష్యాను తప్పించగానే  ఏఐసీఎఫ్‌ ఆతిథ్య హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించింది. 10 మిలియన్‌ డార్లు (సుమారు రూ. 70 కోట్లు) గ్యారంటీ మనీగా డిపాజిట్‌ చేసింది. ఇది చెస్‌లో జరిగే పెద్ద టీమ్‌ ఈవెం ట్‌. ఇందులో దాదాపు 190 దేశాలకు చెందిన 2000 పైగా క్రీడాకారులు తలపడతారు.

భారత్‌ నుంచి జగద్విఖ్యాత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్, తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ హరికృష్ణ, విదిత్‌ గుజరాతీలతో పాటు తెలంగాణ ఆటగాడు అర్జున్‌ ఎరిగైసి... మహిళల కేటగిరీలో హంపి, హారిక, వైశాలి తదితరులు పాల్గొనే అవకాశాలున్నాయి. అయితే జట్లను మే 1న అధికారికంగా> ప్రకటిస్తారు. 2013లో విశ్వనాథన్‌ ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య జరిగిన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌కు  చెన్నై ఆతిథ్యమిచ్చింది. చెన్నై ఆతిథ్యంపై ఆనంద్‌ స్పందిస్తూ ‘ఇది భారత్‌కు, చెన్నై చెస్‌ సమాజానికి గర్వకారణం. చెస్‌కు చెన్నై సరిగ్గా సరిపోతుంది. ఈ దిశగా కృషి చేసిన ఏఐసీఎఫ్‌కు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశాడు.


మరో వైపు  రష్యానుంచి వేదికను మార్చిన ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడే) అక్కడి ఆటగాళ్లను చెస్‌ ఒలింపియాడ్‌లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రష్యాతో పాటు యుద్ధోన్మాదానికి సహకరిస్తోన్న బెలారస్‌ ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నామని,  తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఈ సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని ‘ఫిడే’ ప్రకటించింది.  

మరిన్ని వార్తలు