‘కోహ్లి భయ్యా చెప్పేదాకా నాకు తెలియదు’

15 Mar, 2021 14:26 IST|Sakshi
ఇషాన్‌ కిషన్‌- విరాట్‌ కోహ్లి(ఫొటో కర్టెసీ: కోహ్లి ట్విటర్‌)

ఓయ్‌ టాప్‌ ఇన్నింగ్స్‌.. బ్యాట్‌ పైకెత్తు!

అహ్మదాబాద్‌: ‘‘ఫిఫ్టీ పూర్తైన విషయం నాకు అసలు తెలియనేలేదు. అప్పుడు విరాట్‌ భాయ్‌.. ‘‘ఓయ్‌.. టాప్‌ ఇన్నింగ్స్‌.. బ్యాట్‌ పైకెత్తు... స్టేడియం నలువైపులా చూడు’’ అని చెప్పాడు. అప్పుడే హాఫ్‌ సెంచరీ చేసినట్లు తెలిసింది’’ అంటూ టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ రెండో టీ20 మ్యాచ్‌ విషయాలు పంచుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇషాన్‌ కిషన్‌, కోహ్లి మెరుపు ఇన్నింగ్స్‌తో అలవోకగా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇషాన్‌ కిషన్‌.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. 32 బంతుల్లో 56 పరుగులు చేసి,  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భారత బౌలర్‌ యజువేంద్ర చహల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాన్‌ మాట్లాడుతూ.. కోహ్లితో మైదానంలో జరిగిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు. కోహ్లి ఎనర్జీ సూపర్‌ అని, తనతో కలిసి ఆడటం సరికొత్త అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆడిన ఇషాన్‌, కెప్టెన్‌ తనకు ఇచ్చిన సలహాల గురించి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంచి క్రికెటర్‌గా ఎదగడంలో ఎంతో మంది పాత్ర ఉంది. అంతర్జాతీయ టీ20లో ఆడే ముందు రోహిత్‌ భాయ్‌ నాకు ఎన్నో సూచనలు చేశాడు. అలాగే ఐపీఎల్‌ మాదిరే స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టాలని, ఒత్తిడి ఫీలైతే కష్టమని చెప్పాడు. నిజానికి మైదానంలో అడుగుపెట్టే ముందు కాస్త బెరుకుగా అనిపించింది. కానీ జాతీయ జట్టుకు ఆడుతున్నాననే భావన, టీమిండియా జెర్సీ వేసుకోగానే.. సరికొత్త ఉత్సాహం నిండింది. కచ్చితంగా నా బెస్ట్‌ ఇవ్వాలనే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాను’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: కెమెరాలకు చిక్కిన రోహిత్‌.. సీక్రెట్‌గా..
 అప్పట్లో ఇలాగే జరిగింది.. జార్ఖండ్‌ నుంచి వచ్చి: సెహ్వాగ్‌

మరిన్ని వార్తలు