27 నుంచి బయో బబుల్‌లోకి...

24 Jan, 2021 05:10 IST|Sakshi

చెన్నై చేరుకోనున్న భారత్, ఇంగ్లండ్‌ జట్లు

ఢిల్లీకి రానున్న స్టోక్స్, ఆర్చర్, బర్న్స్‌

ఫిబ్రవరి 5 నుంచి తొలిటెస్టు

చెన్నై: కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై తొలి క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 5 నుంచి జరిగే టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ‘బయో సెక్యూర్‌ బబుల్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. భారత క్రికెటర్లంతా ఈ నెల 27న బయో బబుల్‌లోకి ప్రవేశిస్తారు. టీమిండియా స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ నిక్‌ వెబ్‌ న్యూజిలాండ్‌ నుంచి చెన్నై చేరుకొని ఇప్పటికే హోటల్‌లో ప్రత్యేక గదిలోకి వెళ్లిపోయారు. ఇంగ్లండ్‌ జట్టు ఆటగాళ్లు మాత్రం శ్రీలంకతో సిరీస్‌ తర్వాత కొలంబో నుంచి ఈ నెల 27న ఇక్కడికి వచ్చి నేరుగా హోటల్‌లోకి ప్రవేశిస్తారు.

ఇప్పటికే బయో బబుల్‌లో ఉన్న వీరు చార్టెడ్‌ ఫ్లయిట్‌ ద్వారా రానున్నారు. అయితే శ్రీలంకతో సిరీస్‌లో ఆడని ముగ్గురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు బెన్‌ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్‌ ఆదివారం ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అక్కడే వారికి కోవిడ్‌–19 టెస్టులు నిర్వహిస్తారు. నెగెటివ్‌గా తేలితే వారు చెన్నైకి బయల్దేరతారు. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా సహచరులతో కలవకుండా ఈ ముగ్గురు ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. ఫిబ్రవరి 5 నుంచి, 13 నుంచి ఇక్కడి చిదంబరం స్టేడియంలో తొలి రెండు టెస్టులు జరుగుతాయి. క్రికెటర్లకు సహకారం అందించేందుకు తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తున్న లైజన్‌ మేనేజర్లు, గ్రౌండ్స్‌మన్, డ్రైవర్‌ తదితరులు కలిసి సుమారు 15 మంది బయో బబుల్‌లో ఉంటారు. కొందరు అసోసియేషన్‌ అధికారులను కూడా బయో బబుల్‌లో ఉంచాలని ముందుగా భావించినా... నిర్వహణ ఏర్పాట్లకు సమస్య రావచ్చని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టారు. వీరెవరూ మ్యాచ్‌ రోజుల్లో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లకు సమీపంలోకి రాకూడదని గట్టి ఆంక్షలు విధించారు.

మరిన్ని వార్తలు