వైరల్‌: శార్దూల్‌పై కోహ్లి అసహనం..!

17 Mar, 2021 17:49 IST|Sakshi
టీమిండియా ఆటగాళ్లు(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

మీరు మాత్రం క్యాచ్‌లు వదిలేయొచ్చు కదా: నెటిజన్ల కామెంట్లు

అహ్మదాబాద్‌: బ్యాటింగ్‌ వైఫల్యం.. పసలేని బౌలింగ్‌... పేలవమైన ఫీల్డింగ్‌.. వెరసి మూడో టీ20లో టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. సమిష్టి వైఫల్యంతో లక్ష్యాన్ని కాపాడుకోలేక సిరీస్‌లో 2–1తో వెనుకబడింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒంటరి పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి శార్దూల్‌ ఠాకూర్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో, 12వ ఓవర్‌లో భాగంగా చహల్‌ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో బంతిని లెగ్‌ సైడ్‌ బాదగా, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న శార్దూల్‌ నెమ్మదిగా కదిలాడు. 

అంతేగాక బంతి దొరకగానే సరిగా త్రో చేయలేకపోయాడు. మిస్‌ఫీల్డింగ్‌ కారణంగా ఇంగ్లండ్‌కు మరో పరుగు అదనంగా వచ్చింది. దీంతో కోహ్లి శార్దూల్‌ను చూస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అప్పటికే బెదురుగా చూస్తున్న శార్దూల్‌, తన తప్పేమీ లేదన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. అయితే, కోహ్లి మాత్రం ఇదేమీ బాగాలేదన్నట్లుగా కోపంగా చూశాడు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరు(కోహ్లి, చహల్‌)క్యాచ్‌లు వదిలేసినా పర్లేదు కానీ, శార్దూల్‌ సరిగా త్రో చేయనందుకు ఇంతలా కోప్పడ్డతారా’’ అని విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో  76 పరుగుల వద్ద బట్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి, 20 పరుగుల వద్ద బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను చహల్‌ వదిలేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికే మ్యాచ్‌ దాదాపుగా  భారత్‌ చేజారడంతో వాటిని అందుకున్నా పెద్దగా ఫలితం ఉండకపోయేది!

చదవండి: వుడ్‌ బౌలింగ్‌తో... బట్లర్‌ బ్యాటింగ్‌తో...
పంత్‌ తొందరపడ్డావు.. రెండు రన్స్‌తో ఆగిపోవాల్సింది

మరిన్ని వార్తలు