భారత్‌లోనా...ఆస్ట్రేలియాలోనా... 

7 Aug, 2020 03:29 IST|Sakshi

నేడు ఐసీసీ కీలక భేటీ 

దుబాయ్‌: కరోనా కారణంగా వాయిదా పడిన టి20 ప్రపంచకప్‌లను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వాటి వేదికలను మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పుడు దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు నేడు ఐసీసీ ఉన్నతస్థాయి అధికారుల బృందం సమావేశమవుతోంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం 2021, 2022లలో రెండు టి20 వరల్డ్‌ కప్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే దేనిని ఎవరు నిర్వహించాలనేదానిపై స్పష్టత రాలేదు.

తమ దేశంలో జరగాల్సిన 2020 టోర్నీ ఏడాది పాటు వాయిదా పడింది కాబట్టి వచ్చే ఏడాది అవకాశం తమకే ఇవ్వాలని ఆస్ట్రేలియా కోరుతుండగా... పాత షెడ్యూల్‌ ప్రకారం 2021 టి20 ప్రపంచకప్‌ అవకాశం తమకే ఇచ్చి 2022 కోసం ఆసీస్‌ ఆతిథ్యం ఇవ్వాలని భారత్‌ వాదిస్తోంది. 2023లో భారత్‌లో వన్డే వరల్డ్‌ కప్‌ కూడా జరగాల్సి ఉన్నందున సంవత్సరం వ్యవధిలో రెండు మెగా ఈవెంట్ల నిర్వహణ సమస్యలతో బీసీసీఐ తమ వాదనను ఐసీసీ ముందు ఉంచుతోంది. వరుసగా రెండేళ్లు రెండు పెద్ద టోర్నీల ఆతిథ్యం ఏమాత్రం బాగుండవని, ప్రేక్షకుల ఆసక్తే తగ్గడమే కాదు... బోర్డు నిర్వహణా శక్తికి కత్తిమీద సాములాంటిదేనని బీసీసీఐ చెబుతోంది. 

మరిన్ని వార్తలు