IPL 2023: ఆ ఫ్రాంచైజీలకు వారిపై ఎంత నమ్మకమో..!

17 Nov, 2022 11:13 IST|Sakshi

కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరుగబోయే ఐపీఎల్‌ 2023 సీజన్‌ మినీ వేలం కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. వేలంలో ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వదిలించుకునే ప్రాసెస్‌ రెండు రోజుల కిందటే (నవంబర్‌ 15) పూర్తయ్యింది. ఇక మిగిలింది మినీ వేలం ప్రక్రియ మాత్రమే. వచ్చే నెలలో జరిగే ఈ తంతులో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ భారత్‌ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి.  

ఇదిలా ఉంటే, గత సీజన్‌లో ఆశించిన మేరకు రాణించలేకపోయినా కొందరు ఆటగాళ్లను ఆయా ప్రాంచైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన వెంకటేశ్‌ అయ్యర్‌ (కేకేఆర్‌), సునీల్‌ నరైన్‌ (కేకేఆర్‌), మాథ్యూ వేడ్‌ (గుజరాత్‌ టైటాన్స్‌), షారుఖ్‌ ఖాన్‌ (పంజాబ్‌ కింగ్స్‌), రియాన్‌ పరాగ్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)లపై సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి నమ్మకంతో వారిని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

  • గత రెండు సీజన్లుగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్‌ అయ్యర్‌, 2021 సీజన్‌లో అద్భుతాలు చేసినప్పటికీ.. గత సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్‌లో అతనాడిన 12 మ్యాచ్‌ల్లో 107.69 స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. పార్ట్‌ టైమ్‌ ఆల్‌రౌండర్‌ అయిన అయ్యర్‌ సీజన్‌ మొత్తంలో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.     
  • సునీల్‌ నరైన్‌ విషయానికొస్తే.. కేకేఆర్‌కే ప్రాతినిధ్యం వహించే ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌ గత సీజన్‌లో దారుణంగా నిరాశపరిచాడు. 2022 సీజన్‌లో అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి, 9 వికెట్లు పడగొట్టాడు.  
  • 11 ఏళ్ల  తర్వత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్‌ వికెట్‌కీపర్‌ మాథ్యూ వేడ్.. 2022 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన వేడ్.. 113.77 స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. వేడ్‌కు 2011 ఐపీఎల్‌ సీజన్‌లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఆ సీజన్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 66.66  స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు.
  • 2022 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా 9 కోట్ల పెట్టి దక్కించుకున్న షారుఖ్‌ ఖాన్‌.. గత సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 108 స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. 
  • అండర్‌-19 వరల్డ్‌కప్‌ ద్వారా వెలుగులోకి వచ్చి 2019 సీజన్‌లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రియాన్‌ పరాగ్‌, గత సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున  ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన పరాగ్‌ 138. 64 స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. 

పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు గత సీజన్‌లో అట్టర్‌ ఫ్లాప్‌ అయినప్పటికీ.. సంబంధిత జట్లు వారిపై విశ్వాసం వ్యక్తం చేసి మరో అవకాశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న షారుఖ్‌ ఖాన్‌, సునీల్‌ నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రియాన్‌ పరాగ్‌లను వారి ఫ్రాంచైజీలు రిలీజ్‌ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 
చదవండి: స్టార్‌ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్‌ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!

మరిన్ని వార్తలు