-

South Africa T20 League: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్‌ తలపిస్తోంది

19 Jul, 2022 17:35 IST|Sakshi

క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన లీగ్‌గా పేరు పొందింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌). క్యాష్‌రిచ్‌ లీగ్‌గా ముద్రించుకున్న ఈ టోర్నీ ఆటగాళ్లకు కాసుల పంట పండిస్తుంది. వేలంలో కోట్ల రూపాయలను గుమ్మరించే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌ల్లోనూ తమ హవాను చూపించడం మొదలెట్టాయి. ఇప్పటికే యూఏఈ వేదికగా జరిగే టి10 లీగ్‌, యూఎస్‌ఏ వేదికగా జరిగే టి20 లీగ్‌లో జట్లను కొనుగోలు చేయడంలో మన ఫ్రాంచైజీలు ముందు వరుసలో ఉంటాయి.

తాజాగా సౌతాఫ్రికా టి20 లీగ్‌ పేరిట క్రికెట్‌ సౌతాఫ్రికా టోర్నీని ప్లాన్‌ చేసింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిల్లో టోర్నీ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాగా ఇందులో మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం విశేషం. ఆ ఆరు జట్లు ఏంటంటే.. కేప్‌టౌన్‌, జోహెన్నెస్‌బర్గ్‌, డర్బన్‌, పోర్ట్‌ ఎలిజిబెత్‌, ప్రిటోరియా, పార్ల్‌గా ఉన్నాయి. 

ఫ్రాంచైజీల పేర్లు కొనుగోలు చేసినవి
కేప్‌టౌన్‌  ముంబై ఇండియన్స్‌
జోహన్నెస్‌బర్గ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌
డర్బన్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌
పోర్ట్‌ ఎలిజిబెత్‌ ఎస్‌ఆర్‌హెచ్‌
ప్రిటోరియా ఢిల్లీ క్యాపిటల్స్‌
పార్ల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌

దీంతో పేరుకు సౌతాఫ్రికా టి20 లీగ్‌లా కనిపిస్తున్నప్పటికి పరోక్షంగా మరో ఐపీఎల్‌ను తలపిస్తోందనే చెప్పొచ్చు. ఇప్పటికైతే సిటీల పేర్లనే ఫ్రాంచైజీలుగా పిలుస్తున్నప్పటికి మరికొన్ని రోజుల్లో టోర్నీకి సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తి కానుంది. ఆ తర్వాత టోర్నీలో పాల్గొనబోతున్న ఫ్రాంచైజీల పేర్లు మారనున్నాయి. ఇక గ్రేమి స్మిత్‌ను ఈ టోర్నీకి కమిషనర్‌గా నియమించింది క్రికెట్‌ సౌతాఫ్రికా.  బ్రాడ్‌కాస్ట్‌ హక్కులకు సంబంధించి క్రికెట్‌ సౌతాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకున్న సూపర్‌ స్పోర్ట్స్‌ చానెల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది.

చదవండి: Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌

జై షా చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు