IPL 2024: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్యా.. ఆ విలువ ఎంత?

26 Nov, 2023 04:20 IST|Sakshi

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్యా

ప్రకటించని మొత్తానికి కుదిరిన డీల్‌! 

భారత క్రికెట్‌లో అత్యుత్తమ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌...ఆడిన రెండు సీజన్లలో ఆటగాడిగా మంచి ప్రదర్శన...కెప్టెన్ గా ఒక సారి జట్టును విజేతగా నిలిపి మరో సీజన్‌లో ఫైనల్‌ చేర్చిన ఘనమైన రికార్డు...అన్నింటికి మించి స్థానిక ఆటగాడు...ఇలాంటి అర్హతలున్న క్రికెటర్‌ను ఏ ఫ్రాంచైజీ అయినా ఎందుకు వదులుకుంటుంది? క్రికెట్‌ కోణంలో చూస్తే మాత్రం ఇందులో ‘సున్నా’ శాతం కూడా సరైన కారణం కనిపించడం లేదు.

వేరే ఇతర కారణాలు హార్దిక్‌ పాండ్యాను గుజరాత్‌ టైటాన్స్‌ జట్టునుంచి ముంబై ఇండియన్స్‌ వైపు నడిపించాయా అనేది ఆసక్తికరం. అన్నింటికి మించి ఐపీఎల్‌ నిబంధనలను అతిక్రమించేలా ఉన్న చర్యతో పాండ్యా బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.   

(సాక్షి క్రీడా విభాగం) :  హార్దిక్‌ పాండ్యా 2015 ఐపీఎల్‌లో ‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్‌గా ముంబై ఇండియన్స్‌ రూ. 10 లక్షలకు తీసుకుంది. ఇక్కడే కెరీర్‌ మొదలు పెట్టిన పాండ్యా ఆ తర్వాత తన పదునైన ఆటతో పైపైకి దూసుకుపోయాడు. భారత్‌లో అత్యుత్తమ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌ ప్రదర్శనే అతడికి దాదాపు ఎనిమిదేళ్ల క్రితం భారత జట్టులో చోటు కల్పించింది.

అతనికి పోటీనిచ్చే, అతని స్థాయి ఆటగాడు భారత్‌లో ఎవరూ లేకపోవడంతో ఏ దశలోనూ కెరీర్‌లో సమస్య రాలేదు. ముంబై ఇండియన్స్‌ జట్టు అతను వచ్చాక నాలుగు టైటిల్స్‌ (2015, 2017, 2019, 2020) సాధిస్తే ఆ విజయాల్లో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. 2021 వరకు అదే జట్టులో అతని ప్రయాణం కొనసాగింది. 2022 మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లనే కొనసాగించే అవకాశం ఉండటంతో ముంబై అతడిని వదులుకుంది. 

నాయకుడిగా నడిపించి... 
2022 ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీని  సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ తీసుకుంది. మెగా వేలానికి ముందు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యాను రూ.15 కోట్లకు ఎంచుకుంది. ఐపీఎల్‌ కెపె్టన్‌ కావాలనే పాండ్యా కోరిక కూడా ఇక్కడ తీరింది. 2022లో విజేతగా నిలిచిన టీమ్‌ 2023లో కూడా ఫైనల్‌ చేరి ఆఖరి బంతికి త్రుటిలో ఓడింది. ఈ రెండూ సార్లు గ్రూప్‌ దశలో టైటాన్స్‌దే అగ్రస్థానం. 30 ఇన్నింగ్స్‌లలో 41.65 సగటు, 133.49 స్ట్రయిక్‌ రేట్‌తో 833 పరుగులు చేసి పాండ్యా 11 వికెట్లు కూడా తీశాడు.  

ముంబై ఇండియన్స్‌ చొరవతోనే... 
ఐపీఎల్‌–2024 కోసం హార్దిక్‌ గుజరాత్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారడం ఖాయమైంది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. అన్ని రకాలుగా కలిసొచ్చిన ఫ్రాంచైజీనుంచి మళ్లీ ముంబైకి మారాలని పాండ్యా ఎందుకు అనుకున్నాడనేదానిపై స్పష్టత లేదు. టీమ్‌ యాజమాన్యంతో ఆర్థికాంశాల్లో విభేదాలు అనేది ముందుగా వినిపిస్తున్న కారణం. తన ఫీజు పెంచమని, దాంతో పాటు తన కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్‌ అవకాశాలు ఎక్కువగా కావాలని కోరగా, టైటాన్స్‌ అందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అయితే వరల్డ్‌ కప్‌కు ముందే ముంబై యాజమాన్యంతో పాండ్యా చర్చలు జరిపాడని, అక్కడ అంగీకారం రావడంతోనే వెళ్లేందుకు సిద్ధమయ్యాడని కూడా వినిపించింది. 36 ఏళ్లు దాటిన రోహిత్‌ మరెంతో కాలం ఐపీఎల్‌ కూడా ఆడే అవకాశం లేదని, అందువల్ల మున్ముందు కెపె్టన్‌గా ముంబైని నడిపించాలనే కోరిక కూడా పాండ్యా వెళ్లిపోయేందుకు ఒక కారణంగా చెబుతున్నారు. అయితే ఇవన్నీ కూడా అంతర్గత అంశాలే కాబట్టి పూర్తిగా బయటపెడితే తప్ప వీటిలో వాస్తవం ఏమిటనేది ఎవరూ చెప్పే అవకాశం లేదు.

పాండ్యాతో సమస్య ఉంటే ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం టైటాన్స్‌ అతడిని నేరుగా విడుదల చేసుకోవచ్చు. అప్పుడు అతను వేలంలోకి వస్తాడు. అన్ని జట్లకూ పాండ్యాను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ‘ట్రేడింగ్‌’ సమయంలో నేరుగా గుజరాత్‌ యాజమాన్యంతో మాట్లాడి భారీ మొత్తం ఇచ్చేందుకు ముంబై సిద్ధమయిందంటే అంబానీ టీమ్‌కే పాండ్యాపై ఆసక్తి ఉన్నట్లు  అర్థమవుతోంది.  

రూ. 15 కోట్లు + ట్రాన్స్‌ఫర్‌ ఫీజులో 50% 
అధికారికంగా 2022 నుంచి పాండ్యాకు గుజరాత్‌  చెల్లిస్తున్న  రూ. 15 కోట్లను ఇప్పుడు ముంబై నేరుగా నగదు రూపంలో చెల్లిస్తుంది. బదిలీ ప్రకారం ఆ టీమ్‌ మరే ఆటగాడిని ఇవ్వడం లేదు. ఇంతే మొత్తం వేలానికి ముందు టైటాన్స్‌ వద్ద మిగులుతుంది. అయితే దీంతో పాటు ‘ట్రాన్స్‌ఫర్‌ ఫీజు’ రూపంలో గుజరాత్‌కు ముంబై భారీ మొత్తం ఇస్తోందని, ఇందులో 50 శాతం పాండ్యా ఖాతా లోకి వెళుతుందని వార్తలు వస్తున్నాయి. అసలు లొసుగు ఇక్కడే ఉంది.

ఈ ఫీజు ఎంత అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. గణితం ప్రకారం దానిని ‘గీ’గా భావిస్తే దాని విలువ ఏమిటో ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు ఆటగాళ్లను ఎంచుకునేందుకు టీమ్‌లకు విధించిన ‘గరిష్ట మొత్తం’ నిబంధనకు అర్థమే లేదు. ముంబై ఖాతానుంచి రూ. 15 కోట్లు మాత్రమే అధికారికంగా తగ్గుతోంది.

అంతకంటే ఎక్కువగా వారు చెల్లించినా అది ఈ లెక్కలోకి రాదు. 2024 సీజన్‌ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గవర్వింగ్‌ కౌన్సిల్‌ అనుమతిచ్చింది. ప్రస్తుతం ముంబై వద్ద రూ. 5.05 కోట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో ఆ జట్టు కామెరాన్‌ గ్రీన్‌ (రూ.17.5 కోట్లు), జోఫ్రా ఆర్చర్‌ (రూ. 8 కోట్లు)లను విడుదల చేసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు