Jasprit Bumrah: 'నేను ధైర్యంగానే ఉన్నా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన

4 Oct, 2022 13:05 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌కు బుమ్రా అధికారికంగా దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత టీమిండియా స్పీడస్టర్‌ మంగళవారం ఉదయం తన ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ''నేను ఈసారి టి20 ప్రపంచకప్‌లో భాగం కాలేనని తెలిసినప్పటికి ధైర్యంగానే ఉన్నాను. నేను తొందరగా కోలుకోవాలని నాపై ప్రేమ చూపిస్తూ కోరుకున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇక ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌ ఆడనున్న టీమిండియాను బయటి నుంచి ఉత్సాహపరుస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా చాలాకాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే పూర్తిగా కోలుకోకముందే అతన్ని ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసి బీసీసీఐ మూల్యం చెల్లించుకుంది. ఆసీస్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు.

ఆ తర్వాత బుమ్రా ప్రపంచకప్‌కు పూర్తిగా దూరం కాలేదని బీసీసీఐ బాస్‌ గంగూలీ పేర్కొనడం.. కోచ్‌ ద్రవిడ్‌ కూడా బుమ్రా టి20 ప్రపంచకప్‌ ఆడే అవకాశాలున్నాయని చెప్పడంతో అభిమానులు బుమ్రా తిరిగి మళ్లీ జట్టులోకి వస్తాడని భావించారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ మెగా ఈవెంట్‌కు బుమ్రా దూరమయ్యాడని బీసీసీఐ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు.

పూర్తిగా కోలుకోలేదంటూ వైద్యబృందం నివేదిక ఇచ్చిన అనంతరం బీసీసీఐ సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. బుమ్రా గాయాన్ని పూర్తిగా సమీక్షించడంతో పాటు నిపుణులతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. బుమ్రా స్థానంలో ఎంపిక చేసే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఇక 2016లో తొలి టి20 మ్యాచ్‌ ఆడిన బుమ్రా ఇప్పటివరకు 57 టి20 మ్యాచ్‌లాడి 67 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: బుమ్రా దూరం.. హార్దిక్‌ పాండ్యా ఎమోషనల్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు