గుండె పగిలినట్లు అనిపించింది: రాహుల్‌

19 Aug, 2020 17:43 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌ తనను షాక్‌కు గురిచేసిందని టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. మిస్టర్‌ కూల్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా అతడికి సరైన విధంగా వీడ్కోలు పలికే అవకాశం లేకుండా పోయిందని వాపోయాడు. తనతో మరొక్కసారి డ్రెస్సింగ్‌ రూం షేర్‌ చేసుకోవాలని ప్రతీ ఒక్క ఆటగాడు కోరుకుంటాడని పేర్కొన్నాడు. ధనాధన్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హఠాత్పరిణామంతో అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లు కూడా షాక్‌కు గురయ్యారు.(అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై) 

ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌ విషయం గురించి కేఎల్‌ రాహుల్‌ మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నిజంగా నా గుండె పగినట్లు అనిపించింది. చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాను. నాతో పాటు ధోని సారథ్యంలో ఆడిన ప్రతీ క్రికెటర్‌ ఇలాంటి ఉద్వేగానికి లోనై ఉంటారు. తనకు వీడ్కోలు చెబుతూ స్పెషల్‌గా ఫేర్‌వెల్‌ ఏర్పాటు చేసే వీల్లేకుండా పోయింది. జట్టులోని ప్రతి ఆటగాడికి ధోని పూర్తి స్వేచ్చనిచ్చేవాడు. ఎలా ఆడాలో చెబుతూనే మా సహజత్వాన్ని కోల్పోకుండా, మా తప్పుల్ని మేమే తెలుసుకునేలా గైడ్‌ చేసేవాడు. 

మమ్మల్ని మాలాగే ఉంచిన ఘనత ధోనీకే దక్కుతుంది. ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే మొదటగా పరిగెత్తుకు వెళ్లేది ధోని దగ్గరికే. తనెప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపేందుకు సిద్ధంగా ఉండేవాడు. ధోనికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ధోనితో పాటు రోహిత్‌, కోహ్లి సారథ్యంలో ఆడటానికి నేను ఇష్టపడతాను. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో విషయం నేర్చుకోవచ్చు’’అని చెప్పుకొచ్చాడు. కాగా కర్ణాటకకు చెందిన రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌-2020లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున కెప్టెన్‌గా మైదానంలోకి దిగనున్నాడు.

మరిన్ని వార్తలు