Shaheen Afridi Car Gift: పాక్‌ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే!

17 Jun, 2022 12:04 IST|Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిదికి అదృష్టం బంగారంలా తగులుతోంది. ఈ ఏడాది షాహిన్‌ అఫ్రిది మంచి ఫామ్‌ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అఫ్రిది ప్రదర్శనను మెచ్చుకుంటూ తాను కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోర్‌ ఖలందర్స్‌ అఫ్రిదికి ఖరీదైన స్వాంకీ కార్‌ను గిఫ్ట్‌గా అందజేసింది. ఈ ఏడాది పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో (పీఎస్‌ఎల్‌) లాహోర్‌ ఖలందర్స్‌ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పీఎస్‌ఎల్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ అడుగుపెట్టినప్పటి నుంచి వరుసగా నాలుగు సీజన్ల పాటు ఆఖరి స్థానానికే పరిమితమైంది. అయితే షాహిన్‌ అఫ్రిది కెప్టెన్‌గా అడుగుపెట్టడంతో లాహోర్‌ ఖలందర్స్‌ జట్టు తలరాత మారిపోయింది.  తన బౌలింగ్‌తో.. కెప్టెన్సీతో జట్టును విజయపథంలో నడిపిన అఫ్రిది లాహోర్‌ ఖలందర్స్‌ను తొలిసారి చాంపియన్‌గా నిలిపాడు.

దీనికి కృతజ్ఞతగా లాహోర్‌ ఖలందర్స్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సీఈవో అతీఫ్‌ రాణా మాట్లాడుతూ.. ''మా కెప్టెన్‌ షాహిన్‌ అఫ్రిదికి కృతజ్ఞతలు. ఒక కెప్టెన్‌గా.. ఆటగాడిగా జట్టును ఎంత సమర్థవంతంగా నడిపాడనేది ఆసక్తికరం. కెప్టెన్‌గా ప్రతిభతో పాటు గొప్ప ప్రయత్నాలకు ఫలితం ఎలా లభిస్తుందనడానికి ఇది మంచి ఉదాహరణ. దీనిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం'' అంటూ పేర్కొంది.

అయితే ఒక్క సీజన్‌లో జట్టును విజేతగా నిలిపినందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తే.. ''మరి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్‌ శర్మకు.. సీఎస్‌కేను నాలుగుసార్లు విజేతగా నిలిపిన ఎంఎస్‌ ధోనికి ఎన్ని కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి ఉంటారు.. కేవలం ఒక్కదానికే ఇంత హడావిడి అవసమరమా'' అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు.

ఇక పీఎస్‌ఎల్‌ ఒక్కటే కాదు.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ షాహిన్‌ అఫ్రిది తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవలే షాహిన్‌ అఫ్రిది ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డ్‌ కొల్లగొట్టాడు. అంతే సర్‌ గార్‌ఫీల్డ్‌ ట్రోపీని అందుకున్న అత్యంత చిన్న వయస్కుడిగా అఫ్రిది పేరు పొందాడు. ఇక 18 ఏళ్ల వయసులో 2022లో పీఎస్‌ఎల్‌లో అడుగుపెట్టిన అఫ్రిది ఆరంభం నుంచి లాహోర్‌ ఖలండర్స్‌ తరపునే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 36 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు.

చదవండి: Viral Video: క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసి ఉండరనుకుంటా!

మరిన్ని వార్తలు