స్పందన కరువైంది...

6 Oct, 2023 04:01 IST|Sakshi

వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌ అంటే సహజంగా క్రికెట్‌ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. టాస్‌ వేసేసరికే స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈ మ్యాచ్‌పై అహ్మదాబాద్‌ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా లేదు. మ్యాచ్‌ ఆరంభమైన చాలాసేపటి వరకు కూడా స్టేడియంలో చాలా భాగం ఖాళీగా కనిపించింది. భారత్‌ లేని మ్యాచ్‌కు లక్షకు పైగా సామర్థ్యం ఉన్న స్టేడియం ఫ్యాన్స్‌తో హౌస్‌ఫుల్‌ అవుతుందని కోరుకోవడం అత్యాశే అయినా మరీ నామమాత్రంగా కూడా జనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

చివరి వరకు వేర్వేరు కారణాలతో టికెట్లు అమ్మకానికి ఉంచకపోవడం, నగరంలో తీవ్రమైన ఎండ, వారాంతం కాకపోవడం కూడా అందుకు కారణాలు కావచ్చు. 40 వేల టికెట్లను స్థానిక రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకు పంచి పెట్టారు. టికెట్లు తీసుకున్న వారంతా వచ్చేందుకు ఆసక్తి కనబర్చలేదని తెలిసింది.  నిజానికి ఇలాంటి మెగా ఈవెంట్‌లు ఆతిథ్య జట్టు మ్యాచ్‌తో ప్రారంభం కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ నిర్వాహకులు భిన్నంగా ఆలోచించి ‘ఫైనలిస్ట్‌’లతో పోరు ఖరారు చేశారు. మ్యాచ్‌ సాగినకొద్దీ సాయంత్రానికి స్టేడియంలో ప్రేక్షకులు సంఖ్య పెరగడం కాస్త ఊరట.  

మరిన్ని వార్తలు