Sakshi News home page

కాన్వేతో కలిసి... గెలుపు ‘రచిన్‌’చాడు

Published Fri, Oct 6 2023 3:59 AM

New Zealand won the first match of the World Cup - Sakshi

గత ప్రపంచకప్‌ ఫైనల్‌కు ప్రతీకారమా అంటే సరిగ్గా ఈ మ్యాచ్‌కు ఆ విలువ లేకపోవచ్చు. కానీ ఇంగ్లండ్‌ను తాము చిత్తు చేసిన తీరు న్యూజిలాండ్‌కు మాత్రం పూర్తి సంతృప్తినిచ్చి ఉంటుంది. దుర్బేధ్యమైన జట్టు, ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగిన డిఫెండింగ్‌  చాంపియన్‌ ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు పేలవ  బ్యాటింగ్‌ ఆపై పసలేని బౌలింగ్‌తో తమ స్థాయిపై సందేహాలు రేకెత్తించింది.

కివీస్‌ మాత్రం అద్భుత ఆటతో తమపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టి ఆపై సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌ల్లోనే అజేయ మెరుపు సెంచరీలు సాధించి  కాన్వే, రచిన్‌ రవీంద్ర మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు పేరిట గెలుపును లిఖించారు. రాహుల్‌+సచిన్‌ పేర్లను తన పేరులో ఉంచుకున్న రచిన్‌ అటు క్లాస్, ఇటు మాస్‌ ఆటను కూడా చూపించడం విశేషం.  
 
అహ్మదాబాద్‌: వన్డే వరల్డ్‌ కప్‌ తొలి పోరు ఏకపక్షంగా ముగిసింది. 2019 ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ జట్టును ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్‌ (86 బంతుల్లో 77; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, జోస్‌ బట్లర్‌ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం కివీస్‌ 36.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 283 పరుగులు చేసింది.

డెవాన్‌ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 273 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో రెండో వికెట్‌కు న్యూజిలాండ్‌ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గప్టిల్‌ –విల్‌ యంగ్‌ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కాన్వే–రచిన్‌ సవరించారు.  

కీలక భాగస్వామ్యం... 
బలమైన లైనప్, చివరి ఆటగాడి వరకు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న ఇంగ్లండ్‌ను చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్‌ రెండో బంతినే బెయిర్‌స్టో (35 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) సిక్సర్‌గా మలిచాడు. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ‘సిక్స్‌’తో స్కోరు మొదలు కావడం ఇదే తొలిసారి. అయితే ప్రత్యరి్థని కట్టడి చేయడంలో కివీస్‌ బౌలర్లు సఫలమయ్యారు. మలాన్‌ (14) విఫలం కాగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలో కివీస్‌ మరో 3 వికెట్లు పడగొట్టింది. రవీంద్ర ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన బ్రూక్‌ (25) తర్వాతి బంతికి వెనుదిరిగాడు.

ఈ దశలో రూట్, బట్లర్‌ ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 72 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని హెన్రీ విడదీశాక ఇంగ్లండ్‌ వేగంగా వికెట్లు కోల్పోయింది. లోయర్‌ ఆర్డర్‌లో ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు కనీసం 300 పరుగులకు చేరువగా కూడా రాలేదు. వన్డే చరిత్రలో ఆడిన 11 మందీ కనీసం రెండంకెల స్కోరు చేయడం ఇదే మొదటిసారి కాగా... ప్రతీ ఒక్కరు అంతంతమాత్రంగానే ఆడటంతో ఇంగ్లండ్‌కు ఫలితం దక్కలేదు.  

ఆడుతూ పాడుతూ... 
స్యామ్‌ కరన్‌ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికే యంగ్‌ (0) అవుట్‌! దాంతో కివీస్‌ ఎలా లక్ష్యాన్ని ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ కాన్వే, రవీంద్ర అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెరీర్‌లో 13వ వన్డే ఆడుతూ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రవీంద్ర పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడగా, ఐపీఎల్‌ అనుభవాన్ని కాన్వే అద్భుతంగా వాడుకున్నాడు. వీరిద్దరు ప్రత్యర్థిపై బౌలర్లందరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. 10 ఓవర్లలోనే స్కోరు 81 పరుగులకు చేరగా, చెరో 36 బంతుల్లోనే రవీంద్ర, కాన్వే అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.

వీరిని కట్టడి చేయడంలో ఇంగ్లండ్‌ విఫలం కావడంతో 20 ఓవర్లకే స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఈ జోడి ఎదురులేకుండా దూసుకుపోయింది. ముందుగా కాన్వే 83  బంతుల్లో, ఆ తర్వాత రవీంద్ర 82 బంతుల్లో శతకాలను అందుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోగా... కివీస్‌ సునాయాసంగా లక్ష్యం చేరింది. విలియమ్సన్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో లాథమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.  

స్కోరు వివరాలు  
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) మిచెల్‌ (బి) సాన్‌ట్నర్‌ 33; మలాన్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 14; రూట్‌ (బి) ఫిలిప్స్‌ 77; బ్రూక్‌ (సి) కాన్వే (బి)  రవీంద్ర 25; మొయిన్‌ అలీ (బి) ఫిలిప్స్‌ 11; బట్లర్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 43; లివింగ్‌స్టోన్‌ (సి) హెన్రీ (బి) బౌల్ట్‌ 20; కరన్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 14; వోక్స్‌ (సి) యంగ్‌ (బి) సాన్‌ట్నర్‌ 11; ఆదిల్‌ రషీద్‌ (నాటౌట్‌) 15; వుడ్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–40, 2–64, 3–94, 4–118, 5–188, 6–221, 7–229, 8–250, 9–252. 
బౌలింగ్‌: బౌల్ట్‌ 10–1–48–1, హెన్రీ 10–1–48–3, సాన్‌ట్నర్‌ 10–0–37–2, నీషమ్‌ 7–0–56–0,  రవీంద్ర 10–0–76–1, ఫిలిప్స్‌ 3–0–17–2. 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (నాటౌట్‌) 152; యంగ్‌ (సి) బట్లర్‌ (బి) కరన్‌ 0; రచిన్‌ రవీంద్ర (నాటౌట్‌) 123; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (36.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–10. బౌలింగ్‌: వోక్స్‌ 6–0–45–0, స్యామ్‌ కరన్‌ 6–2–47–1, వుడ్‌ 5–0–55–0, అలీ 9.2–0–60–0, రషీద్‌ 7–0–47–0, లివింగ్‌స్టోన్‌ 3–0–24–0.  

ప్రపంచకప్‌లో నేడు
పాకిస్తాన్‌ X నెదర్లాండ్స్‌ 
వేదిక: హైదరాబాద్‌  , మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

What’s your opinion

Advertisement