అదేంటో అదే రోజు.. రెండు ట్రిపుల్‌ సెంచరీలు: సెహ్వాగ్

30 Mar, 2021 12:29 IST|Sakshi

నా జీవితంలో ప్రత్యేకమైన తేదీ అదే: సెహ్వాగ్‌

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పాకిస్తాన్‌ గడ్డపై నెలకొల్పిన అరుదైన రికార్డు క్రికెట్‌ ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2004లో దాయాది దేశంలో పర్యటించిన భారత జట్టు, నాటి టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా, ముల్తాన్‌ టెస్టు(మార్చి 28)లో వీరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రిపుల్‌ సెంచరీ(309 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్‌ చరిత్రకెక్కాడు. ఇక ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తన తొలి ట్రిపుల్‌ సెంచరీకి 17 ఏళ్లు నిండిన సందర్భంగా సెహ్వాగ్‌ ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ‘‘మార్చి 29.. నాకు ఎంతో ప్రత్యేకమైన తేదీ. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా గౌరవం లభించింది.

ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై ఈ ఘనత సాధించాను. యాధృచ్చికంగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే రోజు దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాను’’అంటూ పాత వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ క్రమంలో.. ‘‘ముల్తాన్‌ కా సుల్తాన్‌.. వీరూ పా నీ అద్భుత ఇన్నింగ్స్‌ మిస్పవుతున్నాం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  

చదవండి: సచిన్‌ పాజీతో మళ్లీ బ్యాటింగ్‌.. సూపర్‌ ఇన్నింగ్స్‌!  


 

మరిన్ని వార్తలు