నా 'ఈ స్థాయికి' ధోనినే కారణం: జడ్డూ

31 May, 2021 21:30 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో బ్యాటింగ్‌ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, 2015 వన్డే ‍ప్రపంచకప్‌ సందర్భంగా ధోని ఇచ్చిన సలహా తన బ్యాటింగ్‌ను ఎంతో మెరుగుపర్చిందని టీమిండియా స్టార్‌ ఆల్‌రండర్‌ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. కెరీర్‌ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో చాలా తికమక పడేవాడినని, దీంతో షాట్‌ పిచ్‌ బంతులను ఆడమని ధోని సూచించాడని పేర్కొన్నాడు. కెరీర్‌లో ప్రస్తుతం తాను అనుభవిస్తున్న హోదాకు ధోనినే కారణమని ఆకాశానికెత్తాడు. ధోని చెప్పేంత వరకు షాట్‌ ఆడాలా వద్దా? ఏ షాట్‌ ఆడాలి? బంతిని వదిలేద్దామా?ఆడదామా? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలేవని వెల్లడించాడు. ఈ తికమకలో క్రమంగా వికెట్‌ పారేసుకునేవాడినని, దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా, గత రెండేళ్లుగా జడేజా కెరీర్ దూసుకుపోతుంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపుతూ, టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడ్డూ.. భారత జట్టు కీలక సభ్యుడిగా ఎదిగాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ప్రారంభమైన అతని బ్యాటింగ్‌ విధ్వంసం.. నిరంతరాయంగా సాగుతూ టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. ఇటీవల కాలంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్న జడ్డూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమాయత్తమవుతున్న అతను.. బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్నాడు.
చదవండి: వాళ్లు లేకపోయినంత మాత్రానా ఐపీఎల్‌ నిర్వహణ ఆగదు..

మరిన్ని వార్తలు