Asia Cup 2022 Naseem Shah: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా..

8 Sep, 2022 16:02 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో సూపర్‌-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ మధ్య ఉత్కంఠ పోరు జరిగిన సంగతి తెలిసిందే. చివరి వరకు పాక్‌ బ్యాటర్లకు అఫ్గన్‌ బౌలర్లు చుక్కలు చూపించినప్పటికి.. ఆఖరి ఓవర్లో వచ్చిన పదో నెంబర్‌ ఆటగాడు నసీమ్ షా రెండు సిక్సర్లు బాది తన జట్టుకు ఒక వికెట్‌తో సంచలన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్‌.. ఈ ఆదివారం(సెప్టెంబర్‌ 11న) తుదిపోరులో శ్రీలంకతో అమితుమీ తేల్చుకోనుంది. 

అయితే మ్యాచ్‌ను శాసించిన ఆ రెండు సిక్సర్ల కోసం నసీమ్‌ షా బ్యాట్‌ను అప్పుగా తెచ్చుకున్నాడు. అదేంటి నసీమ్‌ షాకు బ్యాట్‌ లేదా.. అనే డౌట్‌ రావొచ్చు. నసీమ్‌ షాకు బ్యాట్‌ ఉన్నప్పటికి అది బాగా లేకపోవడంతో తనతో పాటే క్రీజులో ఉన్న మహ్మద్‌​హస్నైన్‌ను బ్యాట్‌ అడిగి తీసుకున్నాడు. హస్నైన్‌ బ్యాట్‌తోనే నసీమ్‌ షా ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు.

కాగా మ్యాచ్‌ అనంతరం నసీమ్‌ షా మాట్లాడుతూ.. ''నాకు తెలిసి ఈరోజు అందరూ నా బ్యాటింగ్‌ గురించే మాట్లాడుకుంటారు. అయితే మీకు తెలియని విషయమేంటంటే.. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నెట్స్‌లో తీవ్ర బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశా. అయితే నా బ్యాట్‌ సరిగా లేకపోవడంతో మహ్మద్‌ హస్నైన్‌ బ్యాట్‌ను తీసుకున్నా. ఆ బ్యాట్‌తోనే రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించా'' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత మహ్మద్‌ హస్నైన్‌ కూడా స్పందింస్తూ.. ''ఓవర్‌  ప్రారంభానికి ముందు నసీమ్‌ నా దగ్గరకి వచ్చి బ్యాట్‌ అడిగాడు. సరే ఒకవేళ సింగిల్‌ తీస్తే బ్యాట్‌ను తిరిగి ఇవ్వు అని చెప్పా. కానీ నసీమ్‌ నాకు బ్యాట్‌ ఇచ్చే అవకాశం లేకుండానే తానే రెండు సిక్సర్లు బాది సంచలన విజయం అందించాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: పాకిస్తాన్‌ ఫైనల్‌కు.. టీమిండియా ఇంటికి

మరిన్ని వార్తలు